ప్రపంచంహోమ్

పాకిస్తాన్ కు మళ్లీ హెచ్చరిక జారీ చేసిన భారత్

#OparationSindoor

సరిహద్దుల్లో ఏ మాత్రం అతిగా ప్రవర్తించినా ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది లేదని భారత్ మరొక్క మారు పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా భారత సైన్యం పాకిస్థాన్‌కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేసింది. సరిహద్దు అవతల ఉన్న ఏ ఉగ్రవాద స్థావరమూ ఇప్పుడు సురక్షితం కాదని, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే “న్యూ నార్మల్” విధానాన్ని భారత్ కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రారంభమైన ఈ విధానం ఇకపై మరింత దూకుడుగా కొనసాగుతుందని సైనికాధికారులు వెల్లడించారు.

ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్ అమలులో కీలకపాత్ర పోషించిన భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం మాజీ ఆపరేషన్స్ చీఫ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ, నియంత్రణ రేఖ అవతల ఉన్న ఏ ఉగ్ర స్థావరమూ ఇప్పుడు రక్షితంగా లేదన్నారు. “మేము అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాం.. ప్రతి ఉగ్ర మౌలిక సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుంటాం.. సమయం, విధానం మాత్రం మా నిర్ణయం” అని స్పష్టం చేశారు.

కనీసం వంద మంది ఉగ్రవాదులు హతం

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా గత ఏడాది మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైన్యం వెల్లడించింది. అనంతరం పాకిస్థాన్ ప్రతీకార దాడులకు ప్రయత్నించినప్పటికీ, భారత దళాలు వాటిని సమర్థంగా తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు. మే 10న రెండు దేశాల సైన్యాధికారుల మధ్య హాట్‌లైన్ చర్చల అనంతరం ఉద్రిక్తతలు తగ్గినట్లు పేర్కొన్నారు.

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం అనేక ఉగ్ర శిబిరాలు సరిహద్దు ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకు తరలించబడుతున్నాయని, అయితే దూరం పెరగడం వల్ల వాటికి రక్షణ లభించదని హెచ్చరించారు. భారత సైన్యం ఖచ్చితమైన దాడి సామర్థ్యంతో ఎక్కడైనా లక్ష్యాన్ని ఛేదించగలదని పేర్కొన్నారు.

“ఆపరేషన్ సింధూర్ ముగింపు కాదు.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే” అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు దీర్ఘకాలం కొనసాగుతున్న సమయంలో భారత్ మాత్రం స్పష్టమైన లక్ష్యాలతో దాడి చేసి, లక్ష్యాలను సాధించిన వెంటనే యుద్ధాన్ని ఆపిందని చెప్పారు. శత్రువుకు గట్టి షాక్ ఇచ్చి, వారి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను దెబ్బతీసినప్పటికీ దీర్ఘకాల యుద్ధంలో చిక్కుకోకుండా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్నారు.

మా ఆయుధ శక్తి ప్రపంచానికి వెల్లడించాం

ఈ ఆపరేషన్ ద్వారా భారత్ స్వదేశీ ఆయుధ వ్యవస్థల శక్తిని ప్రపంచానికి చాటిందని రాజీవ్ ఘాయ్ తెలిపారు. బ్రహ్మోస్, ఆకాష్ క్షిపణులు, స్వదేశీ నిఘా వ్యవస్థలు, టార్గెటింగ్ టెక్నాలజీలు, ఆధునిక మందుగుండు సామగ్రి సమర్థంగా పనిచేశాయని వివరించారు.

ఆపరేషన్ అమలులో కీలకపాత్ర పోషించిన ఎయిర్ మార్షల్ ఏ కే భారతి మాట్లాడుతూ, ఈ ఆపరేషన్‌లో వైమానిక దళం కీలక పాత్ర పోషించిందన్నారు. చైనా, పాకిస్థాన్ చర్యలను భారత వైమానిక దళం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. “మేము వారి తొమ్మిది ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. వారి 11 ఎయిర్‌ఫీల్డ్స్‌పై దాడులు జరిపాం. భూమిపై గానీ, గాల్లో గానీ 13 విమానాలను కూల్చివేశాం. 300 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఒక అత్యంత విలువైన వైమానిక ఆస్తిని కూడా లక్ష్యంగా చేసుకున్నాం” అని వెల్లడించారు.

డ్రోన్లు, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరికరాలు ఈ ఆపరేషన్ విజయానికి కీలకమయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో భారత్ ఎలాంటి రాజీ పడదని, ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని భారత సైన్యం స్పష్టం చేసింది.

Related posts

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News

నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన

Satyam News

రూ 4.82 కోట్ల విలువైన చైనా బాణసంచా పట్టివేత

Satyam News

అమ్మవారికి అగ్గిపెట్టెలోపట్టే పట్టుచీర సమర్పణ

Satyam News

సింగూర్ కాల్వలకు మరమ్మతులు చేయాలి

Satyam News

గోమాంసం గోడౌన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి

Satyam News

Leave a Comment