ముఖ్యంశాలుహోమ్

అమరావతికి స్పెషల్ జోన్..ఏపీలో కొత్తగా 4 కమిషనరేట్లు.!

#Amaravati

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం..పాలనా సంస్కరణల్లో మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరీకరణ, వేగవంతమైన పారిశ్రామికీకరణను దృష్టిలో ఉంచుకుని నేర నియంత్రణపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 4 నగర పోలీసు కమిషనరేట్ల ఏర్పాటుకు బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం నగరాలను ఇకపై పోలీసు కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. DGP హరీష్‌కుమార్ గుప్తా ఇచ్చిన ప్రజెంటేషన్‌కు క్యాబినెట్ ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో..AP పోలీసు వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.

కొత్తగా ఏర్పాటు కానున్న ఈ 4 కమిషనరేట్లకు IG లేదా DIG స్థాయి సీనియర్ IPS అధికారులు కమిషనర్లుగా బాధ్యతలు చేపడతారు. ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా, ప్రస్తుతం ఉన్న పోలీస్ యూనిట్ల సరిహద్దులు, సిబ్బందినే పునర్‌వ్యవస్థీకరించి మరింత సమర్థవంతంగా వినియోగించుకోనున్నారు. అడ్మిన్, క్రైమ్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్ తదితర కీలక విభాగాలను పర్యవేక్షించేందుకు ప్రతి కమిషనరేట్‌కు ఒక SP స్థాయి అధికారి కోఆర్డినేషన్ DCPగా వ్యవహరిస్తారు. దీనివల్ల ప్రజలకు మరింత వేగంగా పోలీసు సేవలు అందడమే కాకుండా, నేర విచారణలు వేగవంతం కానున్నాయి.

ఆధ్యాత్మిక నగరి తిరుపతి, వాణిజ్య కేంద్రం గుంటూరు కమిషనరేట్లను అత్యధికంగా నాలుగేసి జోన్లుగా విభజించారు. రాజమహేంద్రవరంలో మూడు, కర్నూలులో రెండు జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోన్‌కు ఒక SP స్థాయి అధికారిని డీసీపీగా నియమిస్తారు. సబ్‌డివిజన్లు, పరిధిలోని పోలీస్‌స్టేషన్లను భౌగోళిక పరిస్థితులను బట్టి హేతుబద్ధీకరించారు. తిరుపతిలో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ జోన్లు.. రాజమహేంద్రవరంలో సెంట్రల్, నార్త్, సౌత్ డివిజన్లను కవర్ చేస్తూ మూడు లా అండ్ ఆర్డర్ జోన్లు ఏర్పాటు కానున్నాయి. కర్నూలులో అర్బన్, రూరల్ ప్రాంతాలను కలుపుతూ రెండు భారీ శాంతిభద్రతల జోన్లను డిజైన్ చేశారు.

మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చంద్రబాబు సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యత ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోంది. గుంటూరు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా అమరావతి క్యాపిటల్ రీజియన్ జోన్‌ను ఏర్పాటు చేయడం విశేషం. తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరితో పాటు పలు కీలక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక డీసీపీ ఆధ్వర్యంలో ఈ జోన్ పనిచేయనుంది. మొత్తానికి, టెక్నాలజీతో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేలా పోలీసింగ్‌ను మరింత స్మార్ట్‌గా, ప్రజలకు చేరువగా తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

నువ్వు ముస్లిం అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా రహమాన్?

Satyam News

ప్రభుత్వ స్థలం అక్రమిస్తే కఠినమైన చర్యలు

Satyam News

ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

Satyam News

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

Satyam News

శాంతినగర్ పట్టణంలో అత్యంత వేడుకగా  శివలింగ ప్రతిష్ట.

Satyam News

సైనికాధికారి భార్యపై కన్నేసిన దుర్మార్గులు

Satyam News

Leave a Comment