భారత్–జపాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సైబర్ గార్డెన్స్‌లో ఆదివారం హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్–2026 కార్యక్రమాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.
హైదరాబాద్–జపాన్‌లోని మియోషి నగరాల మధ్య సిస్టర్ సిటీ భాగస్వామ్యం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జపాన్ సంస్కృతి, కళలు, సాంకేతికత, సంప్రదాయాలను ప్రతిబింబించే స్టాళ్లను సందర్శించారు. జపాన్ ప్రతినిధులతో ముచ్చటించి, ప్రదర్శనల విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం, జపాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్, మియోషి నగరాల మధ్య ఏర్పడిన సిస్టర్ సిటీ భాగస్వామ్యం 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషకరమైన విషయమని తెలిపారు.
ఇలాంటి అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు విద్య, సాంకేతికత, పరిశ్రమలు, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారానికి దోహదపడతాయని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, క్రమశిక్షణ, పారిశ్రామిక అభివృద్ధిలో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఐటీ, ఫార్మా, పరిశ్రమలు, ఆవిష్కరణల రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ, జపాన్ మధ్య విద్యా, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో మరిన్ని భాగస్వామ్యాలు ఏర్పడాలని ఆకాంక్షించారు.
భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన దేశాల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ మునియో తకాహాషి, మియోషి నగర డిప్యూటీ మేయర్ తెరువో యమజాకి, జపాన్‌కు చెందిన ఇతర ప్రముఖ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
