ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షుడి మతంపై వివాదం మొదలైంది. “ప్రశ్నించడానికి మీరెవరు?” అని మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు నిలదీయడం, మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది. అయినా వైకాపా ఎమ్మెల్సీలు గొడవ చేస్తూనే ఉన్నారు.
రోజూ ఏదో ఒక ఆరోపణ చేయడం, వాకౌట్ చేసి వెళ్ళిపోవడం, ప్రభుత్వ సమాధానం వినడానికి సిద్ధంగా లేకపోవడం వంటి అంశాలను ప్రజలు గమనిస్తున్నారు. “అప్పటికప్పుడు కాకుండా, దేనికైనా విడిగా (ముందస్తుగా) అభ్యర్థన చేసుకోవాలి” అని మండలి అధ్యక్షుడు వారికి సూచించడం చర్చనీయాంశమైంది. శాసనమండలి చైర్మన్ పదవిని అధిష్టించిన తొలి దళిత నేతగా కొయ్య మోషేన్ రాజు గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కి సంబంధించిన వ్యక్తిగత, రాజకీయ వివరాలు ఇవి:
జననం: 1965, ఏప్రిల్ 10.
స్వస్థలం: పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం లోని గునుపూడి.
తల్లిదండ్రులు: కొయ్యే సుందరరావు, మరియమ్మ.
పదవి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా, అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సహజంగా మన దేశంలో మత నమ్మకాలు వేరు, ధృవీకరణ పత్రాలు వేరుగా ఉంటాయి. మన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన ఉన్నాయి కానీ మత ప్రాతిపదికన లేవు. కాబట్టి, సామాజిక హోదా పరంగా ఇది చట్టపరంగా తప్పు కాదు. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల తిరుపతి లడ్డూ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు, భావోద్వేగాల వల్ల మాటలు మతాల వైపు మళ్లాయి. నిన్న మండలిలో వైకాపా సభ్యుల తీరుతో ఆయన కూడా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
లౌకిక దేశంలో, పార్టీ అధ్యక్షుడిగా తన మతం, ఆచారాలు వేరే అయినప్పటికీ.. తన హయాంలో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో తప్పు జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక తేల్చింది. అటువంటప్పుడు “తప్పు చేసిన వారిని వెంటనే చట్టప్రకారం శిక్షించండి” అని కోరుతూ, కోట్లాది భక్తులకు క్షమాపణలు చెప్పి ఉంటే జగన్ హుందాగా వ్యవహరించినట్లు ఉండేది.
కానీ నిత్యం బయట అబద్ధాలు, మార్ఫింగ్ చిత్రాలతో ఎదురుదాడి చేస్తూ, మండలిలో కూడా భావోద్వేగాలకు గురయ్యేలా రాజకీయ వ్యూహాలను వైకాపా పన్నడం బాధాకరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మత వివక్షకు పాల్పడుతున్న పార్టీగా వైకాపాను ప్రజలు చూస్తున్నారు. జగన్ కూడా అదే కోరుకుంటున్నారో ఏమో? వైకాపా తీరును నిశితంగా పరిశీలిస్తే అలాగే అనిపిస్తోంది.
ఇప్పటికే ఒత్తిడికి గురై మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యానారాయణ ఆసుపత్రి పాలయ్యారు. వైకాపా అధినేతలో మార్పు రావడం అనేది అత్యాశే అవుతుంది. కానీ మూల్యం చెల్లించేది ఆ పార్టీని నమ్ముకున్న వారే. నిన్న సోషల్ మీడియాలో ఈ చిత్రాలు కనిపించాయి. బహుశా అవి చూసి వివాదం మొదలైనట్లుంది!
