ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా, విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ AI హబ్ ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. భీమిలి MLA గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో, భూసేకరణ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అంతర్జాతీయ స్థాయి సంస్థ రాకతో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆశతో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
ఈ మెగా ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు రైతులపై ఒత్తిడి తేవడం, కోర్టు కేసులు, తప్పుడు ప్రచారాలతో ఆటంకాలు సృష్టించాలని చూసినప్పటికీ..ప్రభుత్వం ముందు ఆ కుట్రలు ఫలించలేదు. అభివృద్ధి ఫలాలు తమ గ్రామానికి, భవిష్యత్తు తరాలకు అందుతాయని గమనించిన తర్లువాడ రైతులు, రాజకీయ ప్రేరేపిత ప్రచారాలను తిప్పికొట్టి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు.
రైతులకు స్పెషల్ ప్యాకేజీ –
కూటమి ప్రభుత్వం రైతులకు మంచి ప్యాకేజీ అందిస్తోంది. ఎకరాకు దాదాపు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నారు. ఇక భూమి కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయంగా ఎకరానికి 20 సెంట్ల చొప్పున భూమి కేటాయిస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఇంటి నిర్మాణానికి 3 సెంట్ల స్థలం ఇవ్వనున్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లో షాపు కేటాయింపుతో పాటు గ్రామంలో కళ్యాణ మండపం, ఆధునిక రహదారులు నిర్మించనున్నారు.
మార్చిలో శంకుస్థాపన –
సీఎం చంద్రబాబు ఆదేశాలతో గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తోంది. అభివృద్ధికి అడ్డుపడే శక్తులను ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూనే, మార్చి నెలలోనే గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ రంగంలో మరో మెట్టు పైకి ఎదగడం ఖాయం.
