సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల ముమ్మర సవరణ (SIR) అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో పదవులను గడ్డిపోచలా త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది అయితే, జిరాక్స్ కాపీలతో డ్రామాలు ఆడి గద్దెనెక్కిన మోసపూరిత చరిత్ర రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్న రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో హిట్లర్ గతే పడుతుందని, యూరప్‌లో హిట్లర్ పేరును ఎలా నిషేధించారో, రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అదే రీతిలో బహిష్కరిస్తారని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పాతరేసిందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా రైతుబంధు ఊసే లేదని, గత ఐదు నెలలుగా రైతుబీమాను బంద్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి బోనస్ ఎగ్గొట్టి, వడ్లకు తరుగు పేరిట అన్నదాతలను నిలువునా ముంచుతున్నారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు పైసలు ఇవ్వకుండా గొల్ల కురుమలు, మత్స్యకారులు, చేనేత, గౌడన్నల సంక్షేమ పథకాలను నిలిపివేసి సబ్బండ వర్గాల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు, కులవృత్తుల సంక్షేమాన్ని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పక్కనబెట్టారని.. రేవంత్ రెడ్డిది ‘మిషన్ మోడ్’ కాదు, కేవలం ‘కమీషన్ మోడ్’ అని ఎద్దేవా చేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే కమీషన్లు వస్తాయనే ఉద్దేశంతోనే నిధులన్నీ అటు మళ్లిస్తున్నారని, చివరికి గురుకుల పిల్లల కోడిగుడ్లలో కూడా కమీషన్లు కొడుతున్నారని ఆరోపించారు.
పేదల ఇళ్లకు, విద్యార్థుల ఫీజులకు పైసలు లేవంటున్న సీఎం.. తన క్యాంప్ ఆఫీసుల సోకులకు, ఎంసీహెచ్ఆర్డీలో వందల కోట్లతో నివాసాల ఏర్పాటుకు, తన ఇంటి చుట్టూ ఇనుప కంచెలకు ప్రజా ధనాన్ని తగలేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. రాహుల్ గాంధీ దోస్తుల పిల్లలతో, మంత్రుల పిల్లలతో ఫుట్ బాల్ ఆడేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు.
నగరంలో కనీసం మోరీలు బాగుచేయడం చేతకాని వారు ‘ఫ్యూచర్ సిటీ’ కడతారట అని, 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ పేరిట కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ఖమ్మంలో బాలికపై అఘాయిత్యం జరిగితే ముగ్గురు మంత్రులు పట్టించుకోలేదని, తాను నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితులకు అందుతున్న వైద్య సాయంపై నిలదీస్తేనే ఈ దద్దమ్మ ప్రభుత్వంలో కదలిక వచ్చిందని మండిపడ్డారు.
తన వ్యక్తిగత ఎత్తు (హైట్) గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిల్లర వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “నా ఎత్తుతో నీకేం పని? నువ్వు ఎగ్గొట్టిన పథకాలపై, చేస్తున్న స్కాములపై ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం.. నీ మెడలు వంచి తీరుతాం” అని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, ఓటర్ల ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. చనిపోయిన వారి, డబుల్ ఓట్లను తొలగించే ఈ ప్రక్రియలో కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా చూడాలన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వచ్చేటప్పుడు పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు వారి వెంట ఉండి, ప్రజలకు ఫారాలు నింపడంలో సహాయపడాలని సూచించారు.
అధికారులు సహకరించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, ప్రతిపక్షంగా ఏ వర్గానికి అన్యాయం జరిగినా బీఆర్ఎస్ అండగా నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, స్థానిక మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు సహా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
