హైదరాబాద్హోమ్

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

#drugs

తెలంగాణ ఈగిల్ ఫోర్స్ అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అధిక THC శాతం కలిగిన ప్రీమియం హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా కార్యకలాపాలను వెలికితీసింది. ఈ ముఠా గతంలో అరుదైన వస్తువుల స్మగ్లింగ్‌లో పాల్గొనగా, 2023 నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దృష్టి సారించినట్లు దర్యాప్తులో తేలింది.

2026 ఏప్రిల్ 8న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు సోధా మొహసన్ బహదూర్ భాయ్ వద్ద 13.2 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాచకొండ పోలీసులు, కస్టమ్స్ అధికారుల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్‌లో హరషద్ మన్‌సుఖ్ భాయ్ ప్రజాపతి, సందీప్ వాసాని అలియాస్ రాహుల్ జైన్‌లను అరెస్ట్ చేసి మరో 12.739 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో ఈ ముఠా థాయ్‌లాండ్, హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా భారీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు బయటపడింది. గుజరాత్‌కు చెందిన దల్ అబ్దుల్లా సదుద్దీన్ నాయ్ అనే వ్యక్తి యువకులను ప్రలోభపెట్టి థాయ్‌లాండ్ నుంచి గంజాయి రవాణా చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో NDPS చట్టంలోని పలు సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో మొత్తం 40 మంది నిందితులను గుర్తించారు. వీరిలో పలువురు అరెస్టు కాగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ముంబైకి చెందిన హేమంగ్ ప్రమోద్ కెలుస్కర్ ఈ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతడు, అతని సోదరుడు సుధాంశు కెలుస్కర్ థాయ్‌లాండ్‌లో క్లబ్ వ్యాపారం నిర్వహిస్తూ గంజాయి స్మగ్లింగ్‌కు కేంద్రంగా ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది.

ముఠా కార్యకలాపాలపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 300 మంది క్యారియర్లను ఉపయోగించి థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు హైడ్రోపోనిక్ గంజాయిని తరలించినట్లు ఈగిల్ ఫోర్స్ గుర్తించింది. కస్టమ్స్ నిఘా నుంచి తప్పించుకోవడానికి వివిధ విమానాశ్రయాలను మారుస్తూ అక్రమ రవాణా కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.

గంజాయి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని, మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి, భవిష్యత్తుకు హానికరమని ఈగిల్ ఫోర్స్ హెచ్చరించింది. యువత డ్రగ్స్, హానికర ఇంజెక్షన్లు, నియంత్రణలేని సప్లిమెంట్లకు దూరంగా ఉండాలని సూచించింది. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే 1908 నంబర్ లేదా ఈగిల్ ఫోర్స్ అధికారిక మార్గాల ద్వారా అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Related posts

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Satyam News

మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’

Satyam News

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

లక్షలాది రూపాయల దుర్వినియోగంపై సీఎంకు ఫిర్యాదు

Satyam News

మహిళా రిటైర్ ఎస్‌.ఐ. మల్లేశ్వరి సేవలు అభినందనీయం

Satyam News

వైసీపీ మళ్లీ గెలవదు…. క్లారిటీ ఇచ్చేసిన జగన్‌..!!

Satyam News

Leave a Comment