రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అత్యాధునిక టెక్నాలజీని తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ బృందంతో కీలక భేటీ నిర్వహించారు. ఏపీలోని విశాఖపట్నం, నెల్లూరు, శ్రీసిటీ లాంటి కీలక ప్రాంతాల్లో మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డి యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని ముఖ్య నగరాలకు ఏయే పరిశ్రమలు సరిపోతాయో పక్కాగా లెక్కలేసిన లోకేశ్..ఎలిమెంట్ గ్రూప్ ముందు స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంచారు. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్, బ్యాంకింగ్ సిస్టమ్ పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమైన RFID ట్యాగ్‌లు, స్మార్ట్ కార్డ్ మైక్రోచిప్‌ల తయారీకి వైజాగ్‌లో అసెంబ్లింగ్ యూనిట్ పెట్టాలని కోరారు.
అలాగే కమ్యూనికేషన్, ఏరోస్పేస్, నావిగేషన్ రంగాల కోసం వైజాగ్ హైటెక్ కారిడార్‌లో మైక్రో ఎలక్ట్రానిక్స్ డిజైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు భారత్‌లో దూసుకుపోతున్న EV, సోలార్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో పవర్ సెమీ కండక్టర్ల ప్లాంట్‌ను, శ్రీసిటీలో రాబోయే ప్రొడక్షన్ ఫెసిలిటీకి అనుసంధానంగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ డివిజన్‌ను నెలకొల్పాలని ప్రతిపాదించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో భాగంగా ఎలిమెంట్ గ్రూప్ సహకారం తీసుకోవాలని లోకేశ్ భావిస్తున్నారు. అమరావతి స్మార్ట్ సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా స్మార్ట్ సిటీ హార్డ్‌వేర్,IoT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్ చేపట్టాల్సి ఉందని ఆయన వివరించారు. రాజధాని నిర్మాణంలో అవసరమయ్యే ఈ IOT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు లోకలైజ్డ్ మైక్రో కంట్రోలర్లు, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హార్డ్‌వేర్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు.
ఇదే పర్యటనలో లోకేశ్‌ను మాస్కో రవాణా వ్యవస్థ విశేషంగా ఆకర్షించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కో ఒకటని, అక్కడ మెట్రో, బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు, బైక్-షేరింగ్ అన్నీ ఒకే యాప్ ద్వారా ప్రయాణికులు వినియోగించుకునే అద్భుతమైన సిస్టమ్ ఉందని ఆయన కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సీసీ కెమెరాల సాయంతో ట్రాఫిక్, భద్రతను పర్యవేక్షిస్తున్న తీరును ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో మన దగ్గర కూడా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ తీసుకురావాలని ఆకాంక్షించారు.
