భారత్ పై అమెరికా విధిస్తున్న సుంకాలు 18 శాతం నుంచి 10 శాతానికి తగ్గాయి. ఇదేదో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వరం అనుకునేరు…. కాదు… కాదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA) కింద విధించిన విస్తృత సుంకాలకు చట్టబద్ధ అధికారం లేదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు ట్రంప్ వాణిజ్య వ్యూహానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ సుంకాలు తగ్గాయి.
దీనికి ప్రతిస్పందనగా, ట్రంప్ 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 122ను అమలు చేస్తూ 150 రోజుల పాటు అమెరికాలోకి వచ్చే ఎక్కువ శాతం వస్తువులపై 10 శాతం ‘అడ్ వలోరం’ దిగుమతి సుంకాన్ని విధిస్తూ ప్రకటనపై సంతకం చేశారు. ఈ సుంకం ఫిబ్రవరి 24 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అమల్లోకి వస్తుంది (ఈస్ట్రన్ స్టాండర్డ్ టైమ్). కొత్త ఆదేశాల ప్రకారం, ఇంతకు ముందు 18 శాతం వరకు సుంకాలు ఎదుర్కొన్న భారత్‌కు ఇప్పుడు సాధారణంగా 10 శాతం సుంకమే వర్తిస్తుంది. అయితే, కొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు మినహాయింపులు ఉండొచ్చు. వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, ఈ తాత్కాలిక సుంకం “మూలభూత అంతర్జాతీయ చెల్లింపుల సమస్యలు” పరిష్కరించేందుకు ఉద్దేశించబడింది. 2024లో అమెరికా సరుకుల వాణిజ్య లోటు 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, చెల్లింపుల సమతుల్యత లోటు పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా అమెరికా డాలర్ల అవుట్‌ఫ్లోను తగ్గించడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం, ఆర్థిక మరియు జాతీయ భద్రతను బలోపేతం చేయడం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
మినహాయింపులు పొందిన ఉత్పత్తులు:
కీలక ఖనిజాలు
ఇంధన ఉత్పత్తులు
కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు
ఔషధాలు
కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు
ఏరోస్పేస్ ఉత్పత్తులు
పుస్తకాలు వంటి సమాచార సామగ్రి
అదనంగా, సెక్షన్ 232 కింద ఇప్పటికే సుంకాలకు లోబడి ఉన్న వస్తువులు, కెనడా మరియు మెక్సికో నుంచి USMCA ఒప్పందం ప్రకారం వచ్చే ఉత్పత్తులు, డొమినికన్ రిపబ్లిక్-సెంట్రల్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద ఉన్న కొన్ని టెక్స్టైల్, దుస్తుల ఉత్పత్తులు కూడా ఈ తాత్కాలిక సుంకం నుంచి మినహాయించబడ్డాయి.
ఇకపోతే, తక్కువ విలువ గల సరుకులకు వర్తించే ‘డ్యూటీ-ఫ్రీ డి మినిమిస్’ సౌకర్యాన్ని నిలిపివేస్తూ ట్రంప్ వేరే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీంతో అలాంటి సరుకులపై కూడా ఈ తాత్కాలిక 10 శాతం సుంకం వర్తిస్తుంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తమ విస్తృత వాణిజ్య విధానాన్ని ఆపలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. తయారీ రంగాన్ని తిరిగి అమెరికాలోకి తీసుకురావడం, అమెరికన్ కార్మికులను రక్షించడం, వాణిజ్య సమతుల్యత సాధించడం వంటి లక్ష్యాలకు సుంకాలు కీలక సాధనమని పునరుద్ఘాటించింది.
అలాగే, 1974 ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద అన్యాయమైన లేదా వివక్షపూరిత విదేశీ వాణిజ్య విధానాలపై కొత్త దర్యాప్తులు ప్రారంభించేందుకు యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ కార్యాలయాన్ని ట్రంప్ ఆదేశించారు. IEEPA నుంచి సెక్షన్ 122కు చట్టబద్ధ ఆధారం మారినా, సుంకాలు మరియు చర్చల ద్వారా వాణిజ్య ఒప్పందాలను కలిపి అమలు చేసే అమెరికా వాణిజ్య విధానం దిశ మాత్రం మారలేదని అధికారులు తెలిపారు.
భారత్‌కు తక్షణ ప్రభావం పరంగా చూస్తే, 18 శాతం బదులుగా 10 శాతం సుంకం అమలు కావడం ఉపశమనమే. అయితే ఉత్పత్తులవారీగా మినహాయింపులు, భవిష్యత్తులో జరిగే దర్యాప్తులు రంగాలవారీ వాణిజ్య ప్రవాహాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో భారత ఎగుమతిదారులు సమీక్షించాల్సి ఉంటుంది.
