రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్‌పహాడ్ మండలం నూర్జహాన్‌పేట, గూడెపుకుంట తండా గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి పంటల పరిస్థితి, సాగునీరు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీదెళ్ల విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించి లాగ్‌బుక్‌ను పరిశీలించడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన రైతులు సగం పొలాల్లోనే నాట్లు వేసుకున్నారని, అందులోనూ సగానికి పైగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నీళ్లు, విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు.
‘‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుగా ఉంది ఈ ప్రభుత్వం పాలన తీరు. ఉన్న విద్యుత్‌ను కూడా సక్రమంగా అందించలేక మోటార్లు కాలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నారు’’ అని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
రైతుల సమస్యలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మీడియా సంస్థలు తమ విలేకరులను గ్రామాల్లోకి పంపించాలని ఆయన కోరారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేయాలని అన్నారు. రైతాంగం విషయంలో రాజకీయాలకు తావు ఉండకూడదని, రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగలేదని వ్యాఖ్యానించారు.
‘‘ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టింది. ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసు. ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు’’ అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పదేళ్ల పాటు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నామని ఆయన పేర్కొన్నారు. మరోసారి పంటలను కాపాడుకునేందుకు రైతులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని, కన్నేపల్లి పంప్‌హౌస్‌ను ప్రస్తుతం స్విచ్ ఆన్ చేసినా సరిపడా నీరు అందుబాటులో ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులను హెచ్చరిస్తున్నానని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయమన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తనపై దాడులు చేస్తే ఎండిపోయిన పొలాల సమస్యలు మరుగునపడతాయా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించే రాజకీయాలతో రైతుల ఇబ్బందులు తొలగిపోవని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పంటలకు నీరు, విద్యుత్ అందించే అంశంపై దృష్టి సారించాలని జగదీష్ రెడ్డి సూచించారు. లేనిపక్షంలో రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పోరాటం తప్పదని స్పష్టం చేశారు.
