ముఖ్యంశాలుహోమ్

మార్కెట్లలో ‘లేపాక్షి’ జోరు..120కి పైగా ట్రేడ్ ఎంక్వైరీలు

#Savitha

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘భారత్ టెక్స్ 2026’ అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ (లేపాక్షి) పెవిలియన్‌ను రాష్ట్ర చేనేత, జౌళి, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ  మంత్రి  ఎస్. సవిత గురువారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి)  చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి  ఎస్. సవిత పెవిలియన్‌లోని వివిధ స్టాళ్లను పరిశీలించి, ప్రదర్శనలో పాల్గొన్న హస్తకళాకారులతో ముచ్చటించారు. వారి అద్భుతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని ఆమె ఎంతగానో అభినందించారు. రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ చేనేత, హస్తకళల వైభవాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చాటిచెప్పడంలో లేపాక్షి సంస్థ చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు.

ఆకట్టుకున్న ప్రత్యక్ష ప్రదర్శనలు:

ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో రాష్ట్రానికి చెందిన నాలుగు ప్రసిద్ధ సాంప్రదాయ కళలైన క్రోచెట్ లేస్ (Crochet Lace), పెడన కలంకారీ (Pedana Kalamkari), కార్పెట్ వీవింగ్, కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ రంగాలకు చెందిన మాస్టర్ కళాకారులు ప్రత్యక్ష ప్రదర్శనలు  ఇచ్చారు. ఈ ప్రదర్శనలు దేశ, విదేశాల నుంచి వచ్చిన డిజైనర్లు, ఎగుమతిదారులు, పరిశ్రమ ప్రతినిధులు, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అద్భుతమైన స్పందన – వ్యాపార అవకాశాలు:

భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ ప్రదర్శనల్లో ఒకటైన ‘భారత్ టెక్స్ 2026’లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. ప్రదర్శన పొడవునా 3,000 మందికి పైగా సందర్శకులు ఈ పెవిలియన్‌ను సందర్శించారు. దీని ద్వారా దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారుల నుండి 120కి పైగా ట్రేడ్ ఎంక్వయిరీలు వచ్చాయి. అంతేకాకుండా, ప్రొడక్ట్ సోర్సింగ్, డిజైన్ కొలాబరేషన్స్, ఎగుమతి భాగస్వామ్యాల కోసం పలు సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఇది ప్రపంచ మార్కెట్‌లో ఏపీ హస్తకళలకు ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది.

కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండ:

పెవిలియన్‌కు వచ్చిన భారీ స్పందన పట్ల మంత్రి  ఎస్. సవిత హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేనేత, హస్తకళల రంగాన్ని బలోపేతం చేసేందుకు, కళాకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు. సాంప్రదాయ నైపుణ్యాలను కాపాడుకుంటూనే, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని, కళాకారులకు విస్తృతమైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు దేశ, విదేశీ ప్రదర్శనలలో పాల్గొనేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

భారత్ టెక్స్ 2026లో లేపాక్షి సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని మరింత పెంపొందించడమే కాకుండా, కళాకారుల కుటుంబాల్లో స్థిరమైన ఉపాధి అవకాశాలకు సరికొత్త బాటలు వేశాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Related posts

నేపాల్ వరదల్లో వందలాది మందిని కాపాడిన దేవత

Satyam News

సాగునీటి సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

Satyam News

గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Satyam News

సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన

Satyam News

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News

మెగా వారసుడికి పేరు పెట్టారు….

Satyam News

Leave a Comment