ప్రత్యేకంహోమ్

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

#TirumalaLadduPrasadam

పవిత్రమైన తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, దేశంలోని అత్యంత ప్రామాణిక ల్యాబ్ చాలా స్పష్టంగా పేర్కొంది. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఐతే ఆ ల్యాబ్ విషయాలను సిట్‌ పట్టించుకోలేదు.

ఇప్పటివరకు థర్డ్ పార్టీ వాలిడేషన్ జరగని, శాస్త్రీయత లేని, అరకొర వసతులున్న ల్యాబ్ రిపోర్టును సిట్ ప్రామాణికంగా తీసుకుంది. ఆ ల్యాబ్‌ నివేదిక ఆధారంగా ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసే అవకాశాలు చాలా తక్కువని సిట్  తేల్చేయడం విస్మయపరుస్తోంది.

ఆ నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె కలిశాయో లేదో పరీక్షించే వ్యవస్థ తమకు లేదని, తాము చేసిన PCR పరీక్షా విధానంలో నెయ్యిలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ పంది కొవ్వు కలిస్తేనే గుర్తించగలమని ఆ ల్యాబ్‌ స్పష్టంగా పేర్కొన్నా..సిట్‌ దాన్నే ప్రామాణికంగా తీసుకుంది. దీన్ని బట్టే సిట్‌ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.

నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఒక్క శాతం కంటే తక్కువ కలిసినా గుర్తించే అత్యాధునిక పరీక్షా విధానాలు  అందుబాటులో ఉన్నా, సిట్‌ వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదన్నది ప్రశ్న. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమైనందున మరింత కచ్చితత్వం కోసం ఆ శాంపిళ్లను విభిన్న ల్యాబ్‌లకు పంపి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

NDDB స్పష్టంగా చెప్పినప్పటికీ.!

వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెయ్యి శాంపిళ్లను అత్యంత ప్రామాణిక సంస్థ అయిన గుజరాత్‌లోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (NDDB) కాఫ్‌ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపింది.

నెయ్యిలో కల్తీ జరిగిందని, దానిలో పాలకు సంబంధించినవి కాకుండా ఫారిన్‌ ఫ్యాట్స్‌ కలిశాయని NDDB నిగ్గుతేల్చింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన  ఎస్‌-విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో హెచ్చుతగ్గులున్నాయని, దానిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేసింది.

TTD నాలుగు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపగా, NDDB ఒక్కో నమూనాను 5 ఈక్వేషన్స్‌లో పరీక్షించింది. అప్పట్లో NDDB రిపోర్టులో పేర్కొన్న అంశాలివీ. TTDకి నెయ్యి పేరుతో సరఫరా అవుతున్న పదార్థం ఎంత ఘోరంగా ఉందో NDDB నివేదిక చాటింది. అందులోని ఎస్‌-విలువలను బట్టి పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసే ఉండొచ్చని అప్పట్లో పలువురు నిపుణులూ పేర్కొన్నారు.

దీనిపై లోతైన దర్యాప్తు కోసం సిట్‌.. అవసరమనుకుంటే ఆ శాంపిళ్లను మరోసారి పరీక్షల కోసం NDDBకి పంపించి, పునఃపరిశీలన చేయించి ఉండాల్సింది. జంతు కొవ్వు కలిసిందో లేదో మరింత కచ్చితత్వంతో చెప్పాలని కోరి ఉండాల్సింది. లేకపోతే NDDBతో సమానమైన, అంతకంటే మెరుగైన మరో సంస్థతో పరీక్షలు చేయించి ఉండాల్సింది.

కానీ, అరకొర సౌకర్యాలున్న NDRI నివేదిక ఆధారంగా..ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలవనే లేదని ఎలా నిర్ధారణకు వస్తుంది? నెయ్యి శాంపిళ్లను  NDRI  అరకొరగానే పరీక్షించిందని ఆ సంస్థ రిపోర్టు బట్టే అర్ధమవుతోంది. సంస్థాగత అవసరాలకు రూపొందించుకున్న మెథడాలజీ ప్రకారం తమ ల్యాబ్‌లో ఆ శాంపిళ్లను పరీక్షించామని, దానికి థర్డ్‌ పార్టీ వాలిడేషన్‌ పెండింగ్‌లో ఉందని ఆ సంస్థ పేర్కొంది.

తమ ల్యాబ్‌లో ఇప్పటిదాకా వాణిజ్య ప్రాతిపదికన పరీక్షలు చేయలేదని, ప్రత్యేకంగా కోరినందునే ఈ శాంపిళ్లను పరీక్షించామని తెలిపింది. గొడ్డు కొవ్వు, చేప నూనెను పరీక్షించే మెథడాలజీ ప్రస్తుతానికి తమ వద్ద లేదని స్పష్టంగా చెప్పింది. ఆ నెయ్యిలో పంది కొవ్వు ఉందా.? అని మాత్రమే పరీక్షించామని, దానిలో పంది కొవ్వు 10 లేదా అంతకంటే ఎక్కువ శాతం ఉంటేనే గుర్తించగలమని  పేర్కొంది.

అధునాతన టెస్టులు ఎందుకు చేయించలేదు?

PCR విధానంలో ఆయా జంతువుల నిర్దిష్ట DNA సీక్వెన్స్‌ల ఆధారంగా పరీక్షించి, నెయ్యిలో పంది, గొడ్డు కొవ్వులు కలిశాయా అన్నది నిర్ధారిస్తారు. కానీ అధిక వేడిపై కాచి నెయ్యి తయారుచేసే క్రమంలో జంతు కొవ్వుల్ని కలిపినా. డీఎన్‌ఏ డీగ్రేడ్‌ కావడం వల్ల కొవ్వు నిర్దిష్ట పరిమాణం కంటే తక్కువ ఉంటే గుర్తించలేరు. అందుకే TTD నెయ్యిలో పందికొవ్వు కలిసిందా, లేదా అన్నది నిర్ధారించుకోవడానికి NDRI నివేదికను ప్రామాణికంగా తీసుకోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నెయ్యిలో ఒక శాతం కంటే తక్కువ పంది, ఇతర జంతువుల కొవ్వు కలిసినా కనిపెట్టేందుకు హైపెర్ఫార్మెన్స్‌ లిక్విడ్‌ క్రొమటోగ్రఫీ (HPLC), గ్యాస్‌ క్రొమటోగ్రఫీ (GC), GC -మాస్‌స్పెక్టోమెట్రీ వంటి అత్యాధునిక పరీక్షా విధానాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ విధానాల్లో DNA సీక్వెన్సింగ్‌కి బదులు ఫ్యాటీ యాసిడ్‌లు, ట్రైగ్లిజరాయిడ్స్, స్టెరోల్స్, స్పెక్ట్రాసిగ్నేచర్స్‌ ఆధారంగా నెయ్యిలో పంది, ఇతర జంతువుల కొవ్వు కలిసిందా, లేదా అన్నది నిర్ధారిస్తారు. అత్యాధునిక విధానాల్లో పరీక్షించకుండా TTDకి సరఫరా చేసిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె కలిసే అవకాశం చాలా తక్కువని సిట్‌ నిర్ధారణకు రావడం విస్తుగొలుపుతోంది.

Related posts

మైనర్ బాలిక దారుణ హత్య: ఉద్రిక్తత

Satyam News

సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News

శ్రీవారి పరకామణి చోరీ కేసు: పిటిషనర్ శ్రీనివాసులుకు ప్రాణహాని భయం

Satyam News

ఫేస్ బుక్, వాట్స్ యాప్ లకు ‘సుప్రీం’ అక్షింతలు

Satyam News

30 వేల మందిని తొలగించనున్న అమెజాన్

Satyam News

కార్యకర్తలకు ద్రోహం చేసిన జీవన్ రెడ్డి

Satyam News

Leave a Comment