తిరుమల శ్రీవారి పరకామణిలో రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్ శుక్రవారం తాడిపత్రి సమీపంలోని రైలు పట్టాలపై విగత జీవిగా పడివున్నాడని దీని వెనక టీటీడీ మాజీ చైర్మన్లు వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల దొంగల ముఠా వుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలక సాక్షి సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శుక్రవారం గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ గుంతకల్లు నుంచి తిరుపతిలోని సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం బయలుదేరిన సతీష్ కుమార్ తాడిపత్రి సమీపంలోని రైలు పట్టాలపై విగత జీవిగా పడివున్నాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని, ఆత్మహత్య కాదన్నారు.
సిట్ విచారణలో వాస్తవాలు వెల్లడిస్తాడనే భయంతోనే….
సిట్ విచారణలో సతీష్ కుమార్ వాస్తవాలు వెల్లడిస్తే ఎక్కడ తమకి ఉచ్చు బిగుస్తుందోననే భయంతో అప్పటి టిటిడి మాజీ చైర్మన్లు వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల దొంగల ముఠా చేత అత్యంత కిరాతకంగా హత్య చేయబడ్డాడని మండిపడ్డారు.
ఈ మాట చెప్పటం వెనక ప్రధాన కారణం ఏమిటంటే అప్పటి పరకామణి చోరీ అంశంలో కీలకపాత్ర పోషించినటువంటి వ్యక్తులు వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డేనని, వీరిద్దరూ వున్న సమయంలోనే ఈ చోరీ ఉదంతం బయటపడటం, తర్వాత లోక్ అదాలత్ లో రాజీ కుదరటం జరిగిందని స్పష్టం చేశారు.
వై.వి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వున్నప్పుడు 2023 జూన్ 19వ తేదీన నిందితుడి రవికుమార్ కి సంబంధించిన కొన్ని ఆస్తులు టీటీడీకి ఇస్తున్నట్లు తీర్మానం చేశారు. ఆగస్టు 2023లో భూమన కరుణాకర్ టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న నెలరోజుల్లోనే సెప్టెంబర్ నెలలో లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చి నిందితుడి రవికుమార్, సతీష్ కుమార్ లతో సంతకాలు చేయించారని, ప్రత్యేకంగా సతీష్ కుమార్ పై ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా లోక్ అదాలత్ లో రాజీ చేయటం జరిగిందని, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎమ్.గిరిధర్ రావు 25-07-2024 తేదీన నివేదిక ఇవ్వటం జరిగిందన్నారు.
బాబాయ్ ని కిరాతకంగా చంపిన వారే…..
పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై.ఎస్.వివేకానంద రెడ్డి గొడ్డలి పోటుతో కిరాతకంగా హత్యకు గురైతే దాన్ని గుండె పోటుగా మార్చి ప్రజలను, చట్టాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారని వై.సి.పి నాయకులంతా పెద్ద ఎత్తున డ్రామాలు ఆడారని అలాగే సతీష్ కుమార్ హత్య విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి సిట్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడంటూ మీడియా ముందుకు వచ్చి నంగనాచి డ్రామాలు ఆడుతున్నాడని, అసలు భూమన కరుణాకర రెడ్డి ఇది ఆత్మహత్యే అంటూ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు.
నిజంగా సిట్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వుంటే గతంలో నిర్భయంగా సిట్ ముందుకు హాజరై కీలక విషయాలు ఎలా వెల్లడిస్తాడని, ఇదంతా కేవలం ప్రజలను, చట్టాన్ని దారి మళ్లించటానికే కరుణాకర్ రెడ్డి ఆడుతున్న నాటకాలని, దీన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు.
పరిటాల హత్య కేసు సాక్ష్యులనూ ఇలాగే లేపేశారు….
గతంలో పరిటాల రవి హత్య కేసులో కీలక సాక్షిగా వున్నటువంటి మొద్దు శీను, పట్టోళ్ల గోవర్థన్, అలాగే వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి అయినటువంటి, కసుమూరి శ్రీనివాస్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, ఈసీ గంగిరెడ్డి, గంగాధర్ రెడ్డులను హత్యలు చేసిన చరిత్ర వైసిపికి వుందన్నారు. పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం సతీష్ కుమార్ ముఖం పై, శరీరం భాగాలపై రాళ్లతో కొట్టినట్లు ఆనవాలు వున్నాయని, పోలీసుల పోస్టు మార్టం అనంతరం మరిన్నీ వాస్తవాలు బయటపడతాయని అన్నారు..
పోలీసులు దీన్ని హత్య కోణంలో విచారణ చేయాలని కోరారు. టీటీడీ కల్తీ నెయ్యి విషయంలో ఆధారాలతో సహా బట్టబయలు అయినట్లు సతీష్ కుమార్ హత్య విషయంలో కూడా వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఒక పాపాన్ని కప్పి పుచ్చుకోవటానికి మరికొన్ని పాపాలు చేస్తూ ముందుకు వెళుతున్నారని , ఇప్పుడు ఆ పాపాలు పండాయని ఈ నర రూపరాక్షసులకీ తప్పకుండా శిక్ష పడుతుందని, వైసిపి నాయకులు ఎన్ని డ్రామాలు ఆడిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెప్పారు.
