పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపునిచ్చేది తెలుగుదేశం పార్టీ అని ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం అశోక్ బంగ్లాలో పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ నేతల సమావేశంలో మంత్రి కొండపల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
బంగ్లాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపిక కాబడిన 42 మంది సభ్యులతో పార్టీ నియమ, నిబంధనలను ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించటం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆలోచనతోఈ బుధవారం బూత్ లెవెల్, మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయిలలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
సర్ ప్రకృియలో చురుకుగా పాల్గొనాలి
పార్టీ విధివిధానాలను విస్తృత పరచడం కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత తరుణంలో సర్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు ఉన్న బూత్ లో ప్రక్రియ వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ కలవటం జరుగుతుందన్నారు. ఓటు హక్కు వినియోగం కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలనీ, ఎక్కువ ఓట్లు కలిగిన బూత్ లలో రోజుకు 50 ఓట్లు మాత్రమే నమోదు ప్రక్రియ జరుగుతుందని దీనిపై బిఎల్ఏ లు దృష్టి సారించాలన్నారు.

సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి సైతం పరుగులు పెట్టిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సోషల్ మీడియాలో తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఆర్భాటము తప్ప అధికారంలో ఉన్నప్పుడు గాని, ఇప్పుడు గాని వైఎస్ఆర్సీపీ ప్రజల సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఐటీడీపీ సభ్యులతో పాటు టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్నారు.
కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపునిచ్చేది తెలుగుదేశం పార్టీ అని, ప్రతి కార్యకర్త, నాయకులు ఈ విషయాన్ని గుర్తించి పని చేయాలనీ, అటువంటివారిని అందలం ఎక్కించడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ మహానాడు ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేయాలన్నారు.
ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టటానికి నాయకులంతా సమాయత్తం కావాలన్నారు. నూతనంగా ఎంపిక కాబడిన సభ్యుల ప్రోటోకాల్ ను ప్రజా ప్రతినిధులు పాటించాలని తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ సామాన్య స్థాయి నుండి పార్టీలో ఉన్నత స్థాయి గుర్తింపునిచ్చేది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఆ దిశగా ఎంపిక కాబడిన కమిటీ సభ్యులంతా పనిచేసే పార్టీలో ఉజ్వల భవిష్యత్తును సాధించాలన్నారు.
పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు ఖాయం
పార్టీ కోసం పాటుపడే వారిని, పార్టీ ఇచ్చిన సిద్ధాంతాలను వేగవంతంగా పూర్తి చేసిన వారికి మంచి గుర్తింపు రావడం ఖాయమని చైతన్యవంతంగా పనిచేయాలన్నారు. పార్టీ సీనియర్ నేత చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు మాట్లాడుతూ పార్టీలో పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తల సైతం ఉన్నారని అటువంటి వారికి తప్పనిసరిగా గుర్తింపు వస్తుందన్నారు.
ఎంపిక కాబడిన 42 మంది సభ్యులలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారితో అనుబంధం ఉన్న వారు సైతం ఉండటం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో రాజకీయాలలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారని వారందరినీ కూడగట్టుకుని ముందుకు సాగాలన్నారు. రాబోవు 30 ఏళ్లు పార్టీని నడిపించగల సత్తా లోకేష్ ఉందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత ఓటర్ లిస్టులో వస్తున్న మార్పులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎక్కువ పరిశ్రమలు, ఎక్కువ పెట్టుబడులు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు.
మార్క్ ఫెడ్ చైర్మన్ బంగారు రాజు మాట్లాడుతూ కష్టపడే గుణం కలిగిన వారిని గుర్తించి పార్టీ పదవులు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రతిపక్ష పార్టీ సర్ ప్రోగ్రాంలో యాక్టివ్ గా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు, అనుకూలమైన వారి ఓట్లు తొలగిస్తారని వాటిపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
