శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం, అదనపు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మానసిక వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
సికింద్రాబాద్‌కు చెందిన ఓ భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి, అనంతరం అరుణాచలం వెళ్లేందుకు AP 03 AT 4599 నంబర్ గల ఇన్నోవా వాహనాన్ని నడిపే స్థానిక టాక్సీ డ్రైవర్ కుమార్‌తో రూ.12,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుటుంబ సభ్యుల సామాను ఎక్కువగా ఉండటంతో వాహనానికి క్యారియర్ అమర్చాలని కోరగా డ్రైవర్ అంగీకరించాడు.
అయితే మరుసటి రోజు ఉదయం నిర్ణీత సమయానికి క్యారియర్ అమర్చకపోవడంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బాధిత కుటుంబం మరో వాహనాన్ని ఏర్పాటు చేసుకుంది. దీనిపై ఆగ్రహం చెందిన డ్రైవర్ కుమార్, భక్తుల కుటుంబం మరో వాహనం ఎక్కకుండా అడ్డుకోవడమే కాకుండా, భక్తుడు మరియు ఆయన భార్యను బహిరంగంగా దుర్భాషలాడి తీవ్రంగా బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతటితో ఆగకుండా, బాధితుడి మొబైల్ నంబర్‌కు వివిధ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ చేయడం, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన వాయిస్ మెసేజ్‌లు పంపించడం ద్వారా మానసిక వేధింపులకు గురిచేసినట్లు కూడా ఫిర్యాదులో వెల్లడైంది.
ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన తిరుపతి జిల్లా పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, సంబంధిత వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తిరుపతికి, తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడి భద్రత, గౌరవం, ప్రశాంతమైన యాత్ర కు అత్యున్నత ప్రాధాన్యత. భక్తులను మోసం చేయడం, బెదిరించడం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం లేదా అదనపు డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలపై కఠిన విధానంతో వ్యవహరిస్తాం. అలాంటి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే వారి వాహనాలను సీజ్ చేసి, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు కూడా చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.
మహిళా భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా లేదా వేధింపులకు పాల్పడినా చట్టంలోని కఠిన నిబంధనల ప్రకారం వెంటనే అరెస్టు చేసి కోర్టులో అభియోగాలు నమోదు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.
భక్తుల రక్షణ కోసం నందకం గెస్ట్ హౌస్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, తిరుమలలోని ప్రధాన ప్రాంతాలు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు.
భక్తులకు విజ్ఞప్తి:
అనధికారిక డ్రైవర్లు లేదా ఏజెంట్ల బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు. ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, అధిక చార్జీలు డిమాండ్ చేసినా, బెదిరించినా లేదా వేధింపులకు పాల్పడినా వెంటనే 112 అత్యవసర సేవల నంబర్‌కు సమాచారం అందించాలి. వాహనం నంబర్, డ్రైవర్ వివరాలతో సమీప పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ అవుట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేయాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేసారు.
