ఒకప్పుడు వైకాపాకు గట్టి బలం ఉంది అనుకున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ దెబ్బకు జగన్ రెడ్డి అక్కడ పార్టీ పరువు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. నియోజకవర్గం ఇన్ చార్జిలను మారుస్తూ కొత్త వారిని తీసుకువచ్చి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
ఇన్ చార్జీలను మార్చి, ఆ తర్వాత సోషల్ మీడియాలో భారీ ప్రచారం చేసి చివరికి సర్వే చేయించుకుంటే తాజా ఇన్ చార్జి కన్నా గత ఇన్ చార్జి బెటర్ అనే రిజల్టు వస్తున్నది. దాంతో ఏం చేయాలో తెలియని జగన్ రెడ్డి మరో ఇన్ చార్జిని నియమిస్తున్నారు.
తాజాగా మంగళగిరి వైఎస్సార్ సీపీ శ్రేణులకు సరికొత్త వినోదం అందుబాటులోకి వచ్చింది. పార్టీ ఇంచార్జ్ పదవి మార్పు అనేది అక్కడ క్రమం తప్పకుండా జరిగే “మ్యూజికల్ చైర్స్” ఆటకు ఏమాత్రం తీసిపోవడం లేదు! నియోజకవర్గంలో రాజకీయం వండుతున్న ప్రతిసారీ సువాసన కోసం క్రొత్తగా ఒక “కరివేపాకు”ను తెచ్చి కూరలో వేయడం, వంట పూర్తికాగానే దాన్ని తీసి పక్కన పారేయడం అధిష్టానానికి అలవాటుగా మారిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఈ వరుసలో ఇప్పటివరకు నలుగురు నేతలు “తాజా కరివేపాకు” హోదాను అనుభవించి, చివరికి పక్కన పడ్డారు:
కరివేపాకు – 1 (ఆళ్ల రామకృష్ణారెడ్డి): ప్రారంభంలో కూరకి మంచి రుచి తెచ్చారు. కానీ కోర్టుల్లో అమరావతి, చంద్రబాబు మీద కేసులు వేసే అవసరాలకు, కరకట్ట ఇంటి చుట్టూ తిప్పి ముంచడానికి వాడి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో, ఆయనే సొంతంగా “నాకొద్దు ఈ వైకాపా పొయ్యి.. ఈ కూర” అని బయటకొచ్చే పరిస్థితి తెచ్చారు.
కరివేపాకు – 2 (గంజి చిరంజీవి): సమన్వయకర్తగా సువాసనలు వెదజల్లినంత కాలం పొగిడి, టికెట్ ఆశ చూపించి, చివరి నిమిషంలో తీసి పక్కన పడేసారు! దాంతో ఆయన ‘తాలింపు’ వైకాపాకి దండం పెట్టేశారు.
కరివేపాకు – 3 (మురుగుడు లావణ్య): ఎన్నికల వేళ ఆదరాబాదరాగా తీసుకొచ్చి డిపాజిట్ పోయేంత వరకు వాడేసి, ఫలితాలు రాగానే అసలు గుర్తుపెట్టుకున్న పాపాన పోలేదు.
కరివేపాకు – 4 (దొంతిరెడ్డి వేమారెడ్డి): ఇన్నాళ్లూ నియోజకవర్గాన్ని మోసి, ఖర్చుపెట్టి కష్టపడి పనిచేస్తే… చివరికి చేతికి దక్కింది “మొండిచేయి”!
కరివేపాకు – 5 (బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి): ఇప్పుడు తాజాగా వేసిన ఐదో కరివేపాకు! “ఈసారైనా నన్ను వంట పూర్తయ్యాక పక్కన పడేయకుండా ఉంచుతారా?” అని ఈయన లోలోపల దిగులుపడుతున్నా, అధిష్టానం మాత్రం “ముందు పరిమళించు… తర్వాత సంగతి తర్వాత చూద్దాం!” అంటోంది.
రోజుకో కొత్త నాటకం ఆడుతూ పార్టీని నవ్వులపాలు చేస్తున్నారని మంగళగిరిలో సొంత కేడరే తలలు పట్టుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్నది ప్రజాదరణ కాదు, కేవలం సూట్‌కేసుల మహిమే అని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, జనం మధ్య ఉండేవాళ్లు వైసీపీకి అస్సలు అక్కర్లేదు. ఎవడి దగ్గర నోట్ల కట్టలు ఎక్కువుంటే వాడికే ఇంచార్జ్ పోస్టు కట్టబెట్టడం పరిపాటిగా మారింది. జేబు నిండా డబ్బులు ఉంటే చాలు, ఏమాత్రం ప్రజాదరణ లేకపోయినా తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇలా డబ్బే అర్హతగా మార్చి కొత్త ముఖాలను తీసుకొస్తున్నా, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి మాత్రం దిగజారిపోతోంది.
నిన్నటిదాకా ఇంచార్జ్‌లుగా బిల్డప్ ఇచ్చిన వాళ్లు ఈరోజు అడ్రస్ లేకుండా పోతున్నారు. జనం మధ్య తిరగకుండా, కేవలం ఫైనాన్షియల్ బ్యాకింగ్ చూసి డమ్మీలను ఇంచార్జ్‌లుగా ప్రకటిస్తే జనం ఓట్లు వేస్తారా? డబ్బులతోనే రాజకీయం నడుస్తుందనుకోవడం వైసీపీ పిచ్చితనమే తప్ప మరొకటి కాదు. రాజకీయాలంటే కోట్లతో కొనుక్కునే వ్యాపారం కాదని, అది ప్రజల నమ్మకమని అందరికీ తెలుసు. మంగళగిరిలో ఎంతమంది కృష్ణులని మార్చినా, ఎన్ని కోట్లు పారించినా వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవు. కేవలం డబ్బునే నమ్ముకుని సాగిస్తున్న ఈ రాజకీయంతో మంగళగిరిలో వైసీపీ దుకాణం పూర్తిగా సర్దేయడం ఖాయంగా కనిపిస్తోంది.
పార్టీ ఆఫీసు బయట కార్యకర్తలు మాత్రం సరదాగా పందాలు కాచుకుంటున్నారు—”ఈ ఐదో కరివేపాకు కాలపరిమితి ఎన్ని రోజులు?” అని! నియోజకవర్గ సమన్వయం సంగతి దేవుడెరుగు కానీ, ఈ ‘కరివేపాకుల మార్పిడి తంతు’ చూసి జనాలు మాత్రం భలే ఆనందిస్తున్నారు. లోకేష్ దెబ్బకు డీఎస్సీ నుండి లిక్కర్ షాపుల్లో మద్యం వరకు ఫేక్ ప్రచారాలు చేస్తూ ఇలా కరేపాకు మ్యూజికల్ ఛైర్స్ ఆడుకుంటోంది వైకాపా. ఇంకా పార్టీ పరిస్థితి అర్థం కాని పిచ్చి కార్యకర్తలు, నాయకులు భ్రమల్లో నుండి బయటకు రావడం లేదు.
