ఆ ముగ్గురు యువతులు ప్రతి రోజూ వైరల్ అయ్యే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లు. ఆ ముగ్గురూ అక్కా చెల్లెళ్లు కూడా. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఏం చేశారో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. నిజం. ఎందుకంటే ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు కలిసి తమ కెమెరా మెన్ ను పెళ్లి చేసేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ఆ ముగ్గురు సోదరీమణులను ఒకే వ్యక్తి (వాళ్ల కెమెరా మెన్) ఆలయంలో వివాహం చేసుకున్నట్లు చూపించే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
శ్యాంపురి ప్రాంతానికి చెందిన వికాస్ అలియాస్ విక్కు (23), ధోరియా గ్రామానికి చెందిన దేవిక (18), ఛవి (19), అలాగే మెహర్‌పూర్ గ్రామానికి చెందిన వారి బంధువు అల్కా (20)లను హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. జూలై 15న ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నలుగురూ సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ సృష్టికర్తలుగా గుర్తింపు పొందినవారని, వికాస్ వారి వీడియోలకు ఛాయాగ్రాహకుడిగా కూడా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
విచారణ సందర్భంగా నలుగురూ తమ వయస్సును నిర్ధారించే పత్రాలను సమర్పించాలని పోలీసులు ఆదేశించారు. అలాగే వివాహం జరిగిన పరిస్థితులపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించారు. సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నామని, చట్టపరమైన ఉల్లంఘనలు ఏవైనా ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ తెలిపారు.
వికాస్ గత ఆరు నెలలుగా తమ సామాజిక మాధ్యమ వీడియోల్లో భర్త పాత్రలో కనిపిస్తున్నాడని మహిళలు వెల్లడించారు. తమ కుటుంబాలు వేర్వేరుగా పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నించడంతో తాము స్వచ్ఛందంగా కలిసి ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వారు చెప్పారు.
ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో కొన్ని హిందూ సంస్థలు, స్థానిక వ్యాపార వర్గాలు ఇది సనాతన సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించాయి. అయితే ఇప్పటివరకు ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు.
స్థానిక విలేకరులతో మాట్లాడిన మహిళలు తాము అందరూ చట్టబద్ధ వయస్సు కలిగినవారమేనని, పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నామని చెప్పారు. తమ చర్యతో ఏ మతాన్నీ అవమానించే ఉద్దేశం లేదని వారు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, చాముండా ఆలయ నిర్వాహకుడు డాక్టర్ శివచరణ్ దాస్ మాట్లాడుతూ, ఆ రోజు ఆలయంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయని, పూజారి ఎవరూ లేరని తెలిపారు. వివాహ తంతు నిజంగా జరిగిందా, జరిగితే దాన్ని ఎవరు నిర్వహించారనే అంశంపై కూడా పరిశీలన కొనసాగుతోందన్నారు.
సర్కిల్ అధికారి పంకజ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ, నలుగురి వయస్సు, పత్రాలు, ఇతర వివరాలను పరిశీలిస్తున్నామని, ఫిర్యాదు అందినా లేదా చట్ట ఉల్లంఘన జరిగినట్లు తేలినా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
