తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా ఒక మహిళ బట్టలు చించిన దారుణ సంఘటనకు సంబంధించి ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది.
ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఒక పార్టీ నాయకుడు గిరి (యాదవ్), మరొక పార్టీ నాయకులైన గురునాథ్ (యాదవ్), శివ, నాగరాజు (ఎస్సీ మాదిగ) లను అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడావని నాగరాజు ప్రశ్నించినందుకు గిరి ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేయగా, ఆయన తన అనుచరులతో కలిసి సుమారు 10 కార్లలో అక్కడకు చేరుకున్నారు.
వారు నాగరాజు ఇంటిలోకి దౌర్జన్యంగా చొరబడి, ఎమ్మెల్యే సమక్షంలోనే ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నాగరాజు భార్య సుచిత్రపై చేయిచేసుకుని ఆమె నైటీని చింపేశారు. అలాగే వారిని వారించబోయిన రాజశేఖర్, నాగరాజు అన్నపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకుని పరామర్శించడానికి వచ్చిన స్థానిక నాయకుడు కొండ పురుషోత్తం కారును ధ్వంసం చేశారు.
నేమకల్లు గ్రామంలో అర్ధరాత్రి వేళ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు సాగించిన అరాచకకాండ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
వైకాపా ఎమ్మెల్యే అనే మదంతో అర్ధరాత్రి వేళ వందలాది మందితో వచ్చి దాడులకు తెగబడటం, టీడీపీ కన్వీనర్ పురుషోత్తం నివాసం, వాహనంపై దాడి చేసి ధ్వంసం చేయడం, ముగ్గురు కార్యకర్తలను తీవ్రంగా గాయపరచడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర పరాభవం అని స్థానికులు వ్యాఖ్యానించారు. అయితే, బాధితురాలి ఆవేదనను చూసి అర్ధరాత్రే అక్కడికి చేరుకుని అండగా నిలిచిన టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పరామర్శ బాధితుల్లో ధైర్యాన్ని నింపగా… పోలీసులు రంగంలోకి దిగి తీసుకున్న చర్యలు శాంతిభద్రతల పరిరక్షణకు అద్దం పడుతున్నాయి.
ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన తనయుడు చంద్రశేఖర్‌తో పాటు దాడిలో పాల్గొన్న మరికొందరిపై కేసులు నమోదు కావడం, ఆ వెంటనే చిప్పగిరిలో ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అరాచక శక్తులకు గట్టి హెచ్చరిక. ప్రజాప్రతినిధి అయినా, చట్టం ముందు అందరూ సమానులేనని ఈ అరెస్టు నిరూపించింది.
నేమకల్లులో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ, ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులకు కఠిన శిక్ష పడేలా చట్టపరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి. రాజకీయ బలంతో దళిత మహిళలపై, సామాన్య ప్రజలపై విరుచుకుపడే వైకాపా ముఠా సంస్కృతికి శాశ్వతంగా చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది!
అరెస్టు అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయనను కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు.
అదే కేసుకు సంబంధించి అరెస్టు చేసిన మిగిలిన వారినీ చట్టపరమైన ప్రక్రియలో భాగంగా కోర్టుకు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.
