“రాజధాని అమరావతిని స్మశానం, ఏడారి అని మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంట… ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధాని… ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధానా..? పార్టీ నడిపే వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది…?
5 ఏళ్ల పాటు రాజధాని అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితి ఉండేది. రాష్ట్ర ప్రజలు చాలా అవమానాలకు గురయ్యారు. 3 రాజధానులు అని చెప్పారు… 3 ప్రాంతాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలిచారు. ఏపీ రాజధాని అమరావతే అని గర్వంగా, కాలర్ ఎగరేసి చెప్పుకుందాం.
దేవతల రాజధాని అమరావతి… ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. విశాఖను నెంబర్ వన్ సిటీ చేస్తాం. తిరుపతి మెగా సిటీగా అవతరిస్తుంది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడితే పట్టుకొచ్చి బట్టలూడదీస్తాం. తప్పు చేస్తే వదిలిపెట్టం…మంచి చేస్తే ఎవరి జోలికి రాను. రాజకీయ ముసుగులో ఘోరాలు చేస్తే ఊరుకోను.”అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు. పల్నాడులో ఫ్యాక్షన్ రాజకీయాలు సహించం“ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఫ్యాక్షన్ రాజకీయాలను టీడీపీ అంతం చేసింది.
రాష్ట్రాన్ని మావోయిస్టులు ఇబ్బందులు పెట్టాలని చూస్తే రాజీ లేకుండా పని చేశాం. నాపై దాడి చేసినా భయపడ లేదు… వెనకాడలేదు. రౌడీలు రోడ్డు మీదకు వస్తే రాష్ట్రంలో చోటు లేదని చెప్పాం. మత సామరస్యాన్ని కాపాడాం. మత విద్వేషాలు లేకుండా చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు.
నేరస్తులే రాజకీయ పార్టీలు నడుపుతున్నారు. బాబాయిని చంపి రాజకీయం చేసినట్టు… రాష్ట్రంలో నేరాలు చేయాలని చూస్తున్నారు. ప్రజలు ఒకసారే మోసపోతారు. ఇక్కడున్నది ఎన్డీయే ప్రభుత్వం…నడిపించేది సీబీఎన్. పల్నాడులో మొన్న ఒక గొడవ జరిగితే అక్కడ రెచ్చగొడతున్నారు. గిల్లిగజ్జాలు పెట్టుకుంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర తోక తిప్పలేరు.
సీమలో ముఠాలను అంతం చేసిన పార్టీ టీడీపీ. పల్నాడులో కూడా పూర్తి ప్రక్షాళన చేసి హింస లేని శాంతియుత ప్రాంతంగా మార్చుతాం. నేను గతంలో పల్నాడు ప్రాంతానికి వెళ్తుంటే నా ఇంటి గేటుకు తాళ్లుకట్టి గేట్లు మూశారు. ఆ తాళ్లే వారికి రాజకీయంగా ఉరితాళ్లు అవుతాయని చెప్పా. ఇప్పుడు అలాగే జరిగింది.
కక్షతీర్చుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. తెలుగుజాతిని బాగు చేయడానికి వచ్చాను. నాడు ఎన్టీఆర్, నేడు నాది ఒకటే లక్ష్యం. తప్పుడు రాజకీయాలు కాదు.. ప్రజా రాజకీయాలు చేయాలి.”అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
