26.3 C
Hyderabad
September 27, 2026
ప్రత్యేకంహోమ్

పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు చేసిన భారత్

#PetalGehlot

పాకిస్తాన్ కు మరొక్క మారు భారత్ తీవ్ర హెచ్చరికలు చేసింది. మళ్లీ ఉగ్రవాదానికి పాల్పడితే పరిణామాలు తప్పవని హెచ్చరిక జారీ చేసింది. ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛ, మానవ హక్కుల విషయంలో పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని భారత్‌ ఆరోపించింది.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్‌ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేసింది. సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలను కొనసాగిస్తే పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ చేస్తున్న వాదనలను భారత్ తిరస్కరించింది.

ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో భారత్‌ తరఫున కార్యదర్శి పేటల్‌ గహ్లోత్‌ మాట్లాడారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. సింధు నదీ జలాలపై భారత్‌ తమ హక్కులను కాలరాస్తోందని ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన గహ్లోత్‌ పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి భద్రతా పాఠాలు చెప్పే పాకిస్థాన్‌ తన భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన చరిత్రను మరచిపోరాదని అన్నారు. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో, ఆ దేశ సైనిక అకాడమీ సమీపంలో నివసించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

షెహబాజ్‌ షరీఫ్‌ కాశ్మీర్‌ సమస్యను ప్రస్తావిస్తూ భారత్‌లో మతపరమైన హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సమాధానమిస్తూ పాకిస్థాన్‌ రాజకీయ వ్యవస్థలో సైనిక వ్యవస్థ ఆధిపత్యం కొనసాగుతోందని గహ్లోత్‌ విమర్శించారు.

ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలపై సైనిక వ్యవస్థ ప్రభావం కొనసాగుతోందని గహ్లోత్‌ ఆరోపించారు. పాకిస్థాన్‌ రాజ్యాంగ సవరణలను కూడా ఆమె ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిపాలనపై ఆ దేశం చేస్తున్న వాదనలను ప్రశ్నించారు.

జమ్మూకా శ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ పూర్తిగా తిరస్కరించింది. జమ్మూకాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమని, దాని విషయంలో పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు లేదని గహ్లోత్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో పాకిస్థాన్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో ప్రజల పరిస్థితిపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని కోరారు. రావలకోట్‌లో హింస, హత్యలు, ప్రాథమిక హక్కుల నిరాకరణ వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు.

పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన ప్రసంగంలో కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దశాబ్దాలుగా కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అక్రమ నిర్బంధాలు, చట్టవిరుద్ధ హత్యలు, బలవంతపు అదృశ్యాలు, సామూహిక శిక్షలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సమస్యలకు సరిహద్దు దాటి ఉగ్రవాదమే ప్రధాన కారణమని గహ్లోత్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఆత్మరక్షణ హక్కును భారత్‌ ఎప్పటికీ వదులుకోదని స్పష్టం చేశారు. గత ఏడాది ఉగ్రవాదులకు ఎక్కడా దాక్కునే అవకాశం లేకుండా భారత్‌ చర్యలు తీసుకుందని పేర్కొంటూ.. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదం కొనసాగితే అందుకు పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

సింధు నదీ జలాల అంశంపైనా ఇరుదేశాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని పాకిస్థాన్‌ ప్రధాని తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్థాన్‌కు కేటాయించిన సింధు నదీ జలాలను భారత్‌ అడ్డుకోవడం, మళ్లించడం లేదా నిలిపివేయడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. సింధు నదీ వ్యవస్థ పాకిస్థాన్‌ జీవనాడి వంటిదని షెహబాజ్‌ పేర్కొన్నారు. అయితే ఐరాసలో హక్కు ప్రత్యుత్తరం సందర్భంగా గహ్లోత్‌ సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన న్యాయపరమైన వాదనలపై నేరుగా స్పందించకుండా.. ఉగ్రవాదం, కశ్మీర్‌, పాకిస్థాన్‌ అంతర్గత రాజకీయ వ్యవస్థ, మానవ హక్కుల అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

ప్రజాస్వామ్యం, మైనారిటీల హక్కులు, మానవ విలువల విషయంలోనూ పాకిస్థాన్‌ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని భారత్‌ ఆరోపించింది. పాకిస్థాన్‌లో మైనారిటీల పరిస్థితి ప్రపంచానికి తెలుసని గహ్లోత్‌ పేర్కొన్నారు. ఐరాస వేదికపై ఎన్ని హామీలు, ప్రకటనలు చేసినా ఆ దేశంలో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరును అవి కప్పిపుచ్చలేవని అన్నారు.

పాకిస్థాన్‌ అంతర్జాతీయ వేదికలపై పదేపదే ఒకే ఆరోపణలను పునరావృతం చేయడం వల్ల అవి నిజాలుగా మారవని గహ్లోత్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాదం, మోసం, ద్వంద్వ వైఖరి పాకిస్థాన్‌కు గానీ, ప్రపంచానికి గానీ ప్రయోజనం చేకూర్చవని ఆమె వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలను పాకిస్థాన్‌ కొనసాగిస్తే భారత్‌ తన భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు.

Related posts

మళ్లీ మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం

Satyam News

ఏపీ సర్కార్‌పై సంచలన సర్వే… చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ షాక్‌

Satyam News

అంతర్జాతీయ చమురు సరఫరాకు మళ్లీ ముప్పు?

Satyam News

నర్సింగ్ ఆఫీసర్లకు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

Satyam News

మంచి కంటెంట్‌తో రాబోతోన్న ‘కర’

Satyam News

భారీ డిమాండ్ వల్లే రూ.300 టికెట్ల బుకింగ్‌లో పోటీ

Satyam News

Leave a Comment