ముఖ్యంశాలుహోమ్

మెటా స్మార్ట్ గ్లాసెస్ తో స్టింగ్ ఆపరేషన్

#dkshivakumar

మెటా స్మార్ట్ గ్లాసెస్ తో తనపై స్టింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేశారని కర్నాటక ముఖ్యమంత్రి డీ కే శివకుమార్ వెల్లడించారు. తనతో పాటు కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌ను రహస్యంగా రికార్డు చేసేందుకు ఓ పారిశ్రామికవేత్త ప్రయత్నించారని కూడా ఆయన అన్నారు.

ఒక కన్నడ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. అయితే, సమావేశాలను రహస్యంగా రికార్డు చేసినట్లు నిర్ధారించే ఆధారాలను ఆయన బహిరంగంగా వెల్లడించలేదు. తనను కలిసేందుకు ఓ పారిశ్రామికవేత్త అధికారుల ద్వారా ముందస్తు అనుమతి తీసుకున్నారని శివకుమార్ తెలిపారు. తొలుత వ్యాపార సంబంధిత అంశాలపై చర్చించిన ఆ వ్యక్తి, ఆ తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటం ప్రారంభించారని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల్లో బూత్ స్థాయి వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై చర్చకు దిగడంతో తనకు అనుమానం కలిగిందన్నారు. ఆ వ్యక్తి ధరించిన మెటా స్మార్ట్ గ్లాసెస్ కూడా తన అనుమానాలకు కారణమయ్యాయని పేర్కొన్నారు.

దీంతో సదరు పారిశ్రామికవేత్త నేపథ్యంపై ప్రాథమిక విచారణ జరపాలని అధికారులను ఆదేశించినట్లు శివకుమార్ వెల్లడించారు. విచారణలో తనకు అందిన సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్‌ను కలిసినప్పుడు కూడా అదే స్మార్ట్ గ్లాసెస్ ధరించారని ఆరోపించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఒక కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మాత్రం వాటిని ధరించలేదని తనకు సమాచారం అందిందన్నారు.

ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నవారి పేర్లు, ఇతర వివరాలను ఇప్పుడే వెల్లడించబోనని శివకుమార్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, రికార్డులను భద్రపరిచినట్లు తెలిపారు. అవసరమైన సమయంలో పూర్తి వివరాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, అయితే వాటికి సంబంధించిన వివరాలను బహిరంగంగా వెల్లడించలేమని అన్నారు.

అందుకే తన మంత్రివర్గ సహచరులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు శివకుమార్ తెలిపారు. వ్యక్తిగత సహాయకులు, ఫోన్ కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా రాజకీయ నాయకులను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు జరగవచ్చని హెచ్చరించినట్లు చెప్పారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న స్టింగ్ ఆపరేషన్ వీడియోల వివాదం కొనసాగుతున్న సమయంలో శివకుమార్ తాజా ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, మెటా స్మార్ట్ గ్లాసెస్‌తో రహస్య రికార్డింగ్‌కు ప్రయత్నం జరిగిందనే ఆరోపణలను నిర్ధారించే ఆధారాలు ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడికాలేదు. సదరు పారిశ్రామికవేత్త పేరును కూడా శివకుమార్ వెల్లడించలేదు.

Related posts

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News

తెలంగాణ లో ‘‘సర్’’ అమలుపై చర్యలు

Satyam News

అమెరికా బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడాలి

Satyam News

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

Satyam News

స్విట్జర్లాండ్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు

Satyam News

విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్

Satyam News

Leave a Comment