జాతీయంహోమ్

ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు ‘దీపావళి శుభాకాంక్షలు’

#SupremeCourtOfIndia

ఢిల్లీ ప్రజలకు సుప్రీంకోర్టు శుభవార్త వినిపించింది. దీపావళి టపాసుల విషయంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) ప్రజలకు సుప్రీంకోర్టు పరిమిత వెసులుబాటు కల్పించింది. ఢిల్లీలో దీపావళికి గ్రీన్‌ నవంబర్ 7, 8 తేదీల్లోనే కాల్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.

ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టం చేసింది. దీపావళి పండుగకు ముందు ఈ ఏడాది నవంబర్ 8న దీపావళి సందర్భంగా నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే పర్యావరణహితమైన గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చేందుకు అనుమతించింది.

జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 29న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వం గుర్తించిన నిశ్శబ్ద ప్రాంతాలకు 300 మీటర్ల పరిధిలో ఎలాంటి బాణసంచా కాల్చకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.

నవంబర్ 9 నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో గతంలో విధించిన బాణసంచా నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే దీపావళి సందర్భంగా రెండు రోజుల పాటు మాత్రమే పరిమిత అనుమతి ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి బాణసంచా కాల్చడానికి వీలుండదని స్పష్టం చేసింది.

గ్రీన్‌ క్రాకర్స్‌ తయారీ విషయంలోనూ సుప్రీంకోర్టు కఠిన నిబంధనలు విధించింది. సీఎస్‌ఐఆర్‌-నీరీ, పెసో సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే ధ్రువీకరణ పొందిన తయారీదారులు మాత్రమే నవంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు గ్రీన్‌ క్రాకర్స్‌ తయారు చేయాలని ఆదేశించింది. సీఎస్‌ఐఆర్‌-నీరీ వెబ్‌సైట్‌లో ఆమోదం పొందిన జాబితాలో ఉన్న బాణసంచాను మాత్రమే తయారు చేయాలని స్పష్టం చేసింది.

లడీలు, బాణసంచా దండల తయారీ, విక్రయాలపై నిషేధం విధించింది. బేరియం కలిగిన బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. సీఎస్‌ఐఆర్‌-నీరీ ఆమోదించని సాధారణ బాణసంచాను కూడా గ్రీన్‌ క్రాకర్స్‌ పేరుతో విక్రయించడానికి, వినియోగించడానికి వీల్లేదని పేర్కొంది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోకి అక్రమంగా, సంప్రదాయ బాణసంచా రవాణా కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.

వాయు కాలుష్యం తీవ్రంగా ఉండే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దీపావళి సమయంలో బాణసంచా వినియోగంపై ప్రతి ఏడాది వివాదం కొనసాగుతోంది. ప్రజల పండుగ సంప్రదాయాలను, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేయడంలో భాగంగా సుప్రీంకోర్టు ఈసారి రెండు రోజుల పాటు పరిమిత సమయాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతి ఇచ్చింది.

Related posts

కేంద్ర ప్రతినిధి బృందంతో చంద్రబాబు భేటీ

Satyam News

రిజర్వేషన్ విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలి

Satyam News

కవిత భూదాన్ హంగామా: పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం బిత్తరపాటు

Satyam News

విజయసాయి రెడ్డి టార్గెట్ భారతీ రెడ్డా?

Satyam News

మొక్కలు నాటిన ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయేన్సర్స్

Satyam News

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల  గ్యాస్ కొరత

Satyam News

Leave a Comment