ముఖ్యంశాలుహోమ్

భారత ప్రధాన న్యాయమూర్తిపై అడ్వకేట్ అనుచిత వ్యాఖ్యలు

#ChiefJusticeOfIndiaSuryakanth

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్‌ సూర్యకాంత్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్‌ సింఘాల్‌ అనే న్యాయవాదికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనపై క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలంటూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ పిటిషన్‌ను జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి నుంచి కాంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్ట్స్‌ చట్టంలోని సెక్షన్‌ 15(1)(బి) ప్రకారం అవసరమైన అనుమతి పొందిన విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్‌లో పేర్కొన్న ఆరోపణల ప్రాథమిక పరిశీలన అనంతరం క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది ప్రదీప్‌ రాయ్‌ ఈ వ్యవహారంపై స్పందిస్తూ కోర్టు విచారణ సమయంలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అన్నారు. సీజేఐని లక్ష్యంగా చేసుకుని సంబంధిత న్యాయవాది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ కూడా పోస్ట్‌ చేశారని వెల్లడించారు. కోర్టు గౌరవ ప్రతిష్ఠలను కాపాడాల్సిన అవసరం ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా ఎస్‌సీబీఏ పిటిషన్‌కు మద్దతు తెలిపారు.

ఈ వివాదం సోమవారం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చోటుచేసుకుంది. న్యాయవ్యవస్థలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఒక కేసును అత్యవసరంగా విచారించాలని కోరుతూ ప్రవీణ్‌ సింఘాల్‌ కోర్టును ఆశ్రయించారు. నవంబర్‌ 2వ తేదీన సీజేఐ కార్యాలయానికి అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై వేచి ఉండాలని సీజేఐ సూచించగా, న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీజేఐ పదవిలో కొనసాగడానికి ఆయనకు అర్హత లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

సీజేఐ స్థానంలో కూర్చునే అర్హత మీకు లేదు, ఆ పదవికి మీరు తగినవారు కాదు, మీలో నిజాయితీ లేదు అంటూ ప్రవీణ్‌ సింఘాల్‌ వ్యాఖ్యానించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను న్యాయస్థానం హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు.

ఈ ఘటనపై ఎస్‌సీబీఏ కార్యదర్శి ప్రజ్ఞా బాగెల్‌, సంయుక్త కార్యదర్శి మీనేష్‌ దూబే అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి నవంబర్‌ 17న క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతి ఇచ్చారు. సీజేఐపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవని, క్షమించరానివని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Related posts

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

రాయచోటి భద్రకాళి ఆలయానికి వచ్చిన సజ్జనార్

Satyam News

తెనాలి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన భవనం ప్రారంభం

Satyam News

ఇది కొంచెం పెద్ద విషయమే… ఓపిగ్గా చదవండి

Satyam News

కేసీఆర్‌ వదిలిన బాణం…. ఏపీ పాలిట శాపం..!!

Satyam News

Leave a Comment