ప్రముఖ అంతర్జాతీయ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడు ససీమ్ దుర్రానీ ఢిల్లీ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. రెండేళ్ల క్రితమే దుర్రానీని పరారీలో ఉన్న నిందితుడిగా పోలీసులు ప్రకటించారు. యమునా నదికి అవతలి ప్రాంతంలో ఆరు నెలల వ్యవధిలో జరిగిన రెండు హత్యల్లోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలో స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన పలు బృందాలు పనిచేస్తున్నప్పటికీ అతడు నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
దావూద్ ఇబ్రహీం డీ-కంపెనీతో సంబంధాలు, ఛోటా షకీల్‌తో సాన్నిహిత్యం, తీహార్ జైలులోనే ఛోటా రాజన్‌ను హతమార్చే పనిని అప్పగించినట్లు ఆరోపణలు వంటి అంశాలతో దుర్రానీ ఢిల్లీ అండర్‌వరల్డ్ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తిగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌తో అతడి నేర ప్రస్థానానికి తెరపడింది.
2016-17లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్‌ను హత్య చేయాలని ఛోటా షకీల్ దుర్రానీకి బాధ్యత అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ పరిణామంతో దావూద్ ఇబ్రహీం ముఠా, ఛోటా రాజన్ వర్గాల మధ్య కొనసాగుతున్న అండర్‌వరల్డ్ ఆధిపత్య పోరులో దుర్రానీ కీలకంగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన కెనడా జర్నలిస్టు తారిఖ్ ఫతాకు బెదిరింపులు పంపిన కేసులోనూ దుర్రానీని గతంలో అరెస్టు చేశారు.
గ్యాంగ్‌స్టర్ హరూన్ సైఫీకి మేనమామ అయిన రాజా మెవాతి అలియాస్ అక్కీ డాన్ హత్య కేసులోనూ దుర్రానీ పేరు ఉంది. దుర్రానీ, సైఫీ గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా మే నెలలో మెవాతి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన సుమారు రెండు వారాలకే దుర్రానీకి ఆర్థికంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రషీద్ అలియాస్ పానీ వాలాను దయాల్పూర్లోని నెహ్రూ విహార్ ప్రాంతంలో కాల్చిచంపారు. దీంతో రెండు ముఠాల మధ్య వైరం మరింత తీవ్రమైంది.
37 ఏళ్ల దుర్రానీపై హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దాడులు, అక్రమ ఆయుధాల కలిగి ఉండటం వంటి 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
