25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

ఇమ్రాన్ ఖాన్ మృతిపై సంచలన పుకార్లు?

#ImranKhan

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయనపై జైల్లోనే అఘాయిత్యం జరిగిందని, అందులో ఆయన మరణించాడనే పుకార్లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ఆయన మరణించినట్లు ఎవరూ ధృవీకరించలేదు. అయినా సరే దాదాపుగా అన్ని ప్రధాన మీడియాలలో ఆయన మరణించాడని, పాకిస్తాన్ లో అల్లకల్లోలం చెలరేగుతున్నదని వార్తలు ప్రసారం చేస్తున్నాయి.

ఆయన వివిధ ఆరోపణలతో రావల్పిండి లోని అదియాలా జైల్లో ఉన్నారు. ఖాన్ ఆరోగ్యం, భద్రతపై అనిశ్చితి పెరుగుతున్న తరుణంలో, ఆయన మరణించారనే వదంతులు ఆఫ్ఘాన్ సోషల్ మీడియా వర్గాల్లో కూడా విస్తరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.

అయితే ఈ ఆరోపణలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టీకరణ ఇవ్వలేదు. గత ఒక నెల రోజులకు పైగా ఇమ్రాన్ ఖాన్‌ను ఎవరితోనూ కలుసుకోనీయని “అప్రకటిత నిషేధం” అమల్లో ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయవాదులు, పార్టీ నేతలు మాత్రమే కాదు, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది కూడా ఏడుసార్లు ప్రయత్నించినప్పటికీ ఆయనను కలుసుకోలేకపోయారు.

జైలు అధికారులు, ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన ఆరోపించారు. అదియాలా జైలు బయట చోటుచేసుకున్న ఘర్షణ, కుటుంబ సభ్యుల ఆందోళనను మరింత పెంచింది. ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు నూరీన్ నియాజి, అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్ జైలు బయట నెలరోజులుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. పోలీసులు అకస్మాత్తుగా స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసి వారి మీద దాడి జరిపినట్లు వారు ఆరోపించారు.

తమను ఎటువంటి హెచ్చరిక లేకుండా లాక్కెళ్లి, బలవంతంగా నేలకేసి తోసి, ఈడ్చుకెళ్లారని నూరీన్ నియాజి తెలిపారు. “71 సంవత్సరాల వయసులో కూడా నన్ను జుట్టు పట్టుకొని నేలరాల్చి, రోడ్డుపై ఈడ్చారు” అని ఆమె వాపోయారు. ఇతర మహిళలను కూడా కొట్టి ఈడ్చుకెళ్లారని తెలిపారు.

ఇది గత మూడు సంవత్సరాలుగా శాంతియుత నిరసనలకు ఎదురుగా పోలీసులు చూపిస్తున్న క్రూర వైఖరిలో తాజా ఉదాహరణ అని వారు పేర్కొన్నారు. స్థానిక వార్తా మాధ్యమాల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు, పలు పీటీఐ కార్యకర్తలను పోలీసులు స్వల్పకాలం అదుపులోకి తీసుకొని, 10 గంటలపాటు సాగిన సిట్-ఇన్‌ను ముగించి, అనంతరం విడుదల చేశారని డున్యా న్యూస్, ట్రిబ్యూన్ పాకిస్థాన్ వెల్లడించాయి.

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి పలు కేసుల్లో జైలులో ఉంటున్నారు. అయితే గత నెల నుంచి ఆయనను ఎవరినీ కలుసుకోనీయకపోవడం, అకస్మాత్తుగా జైలు పరిపాలనలో వచ్చిన కఠిన మార్పులు, ఖాన్ ఆరోగ్యం గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం అన్నీ కలిసి అనుమానాలను తీవ్రతరం చేస్తున్నాయి. అంతేకాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన కొన్ని పష్తూ ఛానెల్‌లు, సోషల్ మీడియా వేదికల్లో ఇమ్రాన్ ఖాన్ మరణించారని వచ్చిన వదంతులను పీటీఐ నేతలు ఉదహరిస్తూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారిక వివరణ లేకపోవడం, నిర్బంధిత నాయకుడిపై పేలవమైన సమాచారం లభించడం, కుటుంబ సభ్యులపై పోలీసుల దాడులు ఇవి అన్నీ కలిపి పాకిస్థాన్‌లో ఇప్పటికే ఉత్కంఠభరితంగా ఉన్న రాజకీయ పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఒకప్పుడు దేశాన్ని క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిపిన నాయకుడు ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు పూర్తిగా ప్రపంచానికి అందని స్థితిలో జైలు గోడల మధ్య ఉండటమే ఆందోళనకు కేంద్రబిందువుగా మారింది.

Related posts

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News

సుప్రీంకోర్టు సంచలనం.. పెద్దిరెడ్డి పల్స్‌ డౌన్‌….!!

Satyam News

క్రైస్తవ మత సంస్థ విదేశీ నిధులపై సీబీఐ కేసు నమోదు

Satyam News

ఉత్తరప్రదేశ్ లో వర్ష భీభత్సం: 50 మంది మృతి

Satyam News

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర కన్నుమూత

Satyam News

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

Satyam News

Leave a Comment