ప్రత్యేకంహోమ్

సిద్ధరామయ్య రాజీనామా: డీ కే కు ఇక లైన్ క్లియర్

#Siddaramaiah

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీ కే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించబోతున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ నాయకత్వ మార్పుపై నెలలుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం కీలక ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రాష్ట్ర పగ్గాలను డీకే శివకుమార్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు.

బెంగళూరులోని తన అధికార నివాసంలో మంత్రివర్గ సహచరులతో నిర్వహించిన అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడగానే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రముఖ వొక్కలిగ నాయకుడు డీకే శివకుమార్ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు.

గత కొన్ని నెలలుగా కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై విస్తృత చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన తుది దశ సమావేశాల అనంతరం సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పుకుని జాతీయ స్థాయిలో బాధ్యతలు స్వీకరించేందుకు పార్టీ అధిష్ఠానం ఒప్పించినట్లు సమాచారం. రాజ్యసభ సభ్యునిగా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రెండున్నర సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి పదవిని మారుస్తామని ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే హామీ ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు సిద్ధరామయ్యకు గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ఆ గడువు గత ఏడాది నవంబరులోనే పూర్తికావడంతో డీకే శివకుమార్ వర్గం నాయకత్వ మార్పుపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది.

తన నిర్ణయంపై సిద్ధరామయ్య త్వరలో మీడియాతో మాట్లాడి, అనంతరం గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, రాజీనామాకు ముందుగా కర్ణాటక కులగణన నివేదికను సిద్ధరామయ్య ఆమోదించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సంప్రదాయంగా ప్రభావశీల వర్గాలుగా భావించిన వొక్కలిగలు, లింగాయతులు ఇకపై అగ్రస్థానంలో లేరని వెల్లడైంది. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వర్గంగా అనుసూచిత జాతులు నిలిచాయి. ఆ తర్వాత ముస్లింలు, లింగాయతులు, వొక్కలిగలు, కురుబలు, అనుసూచిత తెగలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

సిద్ధరామయ్య వెనుకబడిన వర్గాలకు చెందిన కురుబ సమాజ నాయకుడిగా రాష్ట్రంలో విశేష ప్రజాదరణ పొందారు. అలాంటి నేతను తప్పించి పైవర్గాలకు చెందిన డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించడం కాంగ్రెస్‌కు రాజకీయ సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలి కాలంలో వెనుకబడిన వర్గాల రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో వెనుకబడిన వర్గాల నాయకులు ఎంతమంది ఉన్నారో పార్లమెంట్‌లో ప్రశ్నిస్తూ వచ్చారు. ఇప్పుడు కర్ణాటకలో వెనుకబడిన వర్గాల ముఖ్యమంత్రిని తప్పించడం ద్వారా కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Related posts

వై.ఎస్.జ‌గ‌న్ వి హింసా రాజకీయాలు

Satyam News

వైజాగుకు వైకాపా తలాక్!

Satyam News

ప్రధాని మోడీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

Satyam News

ఇన్‌స్టా పెద్దాయనకు చంద్రబాబు భరోసా….. సిద్దాంతంలో ఇంటరెస్టింగ్‌ సీన్‌!

Satyam News

హౌరా డాన్ అరెస్ట్: చెడ్డి పై ఊరేగించిన బెంగాల్ పోలీసులు

Satyam News

కళా భూమి యుగాది పురస్కారానికి పీసీ ఆదిత్య ఎంపిక…

Satyam News

Leave a Comment