మెదక్హోమ్

షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

#HarishRao

షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కుటుంబంలో ఒంటరైన వికలాంగ బాలిక పేరిట కోటి రూపాయలు డిపాజిట్ చేసి, ప్రభుత్వమే ఆ చిన్నారి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే… ఈరోజు జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఒక పోక్సో కేసు నిందితుడు ముగ్గురు పసిపిల్లలతో సహా ఆరుగురిని కిరాతకంగా చంపేయడం రాష్ట్ర ప్రభుత్వ, పోలీసుల వైఫల్యానికి సజీవ సాక్ష్యం.

గత నెల మే 16న ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు నిందితుడికి కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సాధారణ సెక్షన్లు పెట్టి కాపాడే ప్రయత్నం చేశారు.

నెల రోజులు అరెస్టు చేయకపోవడంతోనే బెయిల్ వచ్చింది

నెలరోజుల పాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో అతను కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఈరోజు ఆ కుటుంబాన్నే అంతం చేశాడు. మాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి అని ఆ బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. సరైన సమయంలో ఏసీపీ, డీసీపీ, కమిషనర్ స్థాయిలో సమీక్ష చేసి, కఠిన సెక్షన్లు పెట్టి ఉంటే ఈరోజు ఈ ఆరు హత్యలు జరిగేవి కావు.

అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. కళ్లుతెరువని ముగ్గురు పసిపిల్లలతో పాటు అత్యాచారానికి గురైన బాలికను, ఆమె చెల్లెల్ని, తల్లిని, నాయనమ్మను చంపేశాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో కేవలం ఒకే ఒక అమ్మాయి మిగిలింది. ఆ అమ్మాయికి మాటలు రావు, చెవులు వినబడవు, నడవలేని వికలాంగురాలు.

పూర్తిగా కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి బతికే ఆ చిన్నారి బాగోగులు చూసేందుకు ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరూ మిగిలిలేరు. ఆ అమ్మాయి భవిష్యత్తు తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఇంత ఘోరం జరిగినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు.

ప్రతిపక్ష నేతల అరెస్టు అన్యాయం

అత్యాచారం చేసి, ఆరుగురిని చంపిన కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకోవడానికి నెలల తరబడి సమయం తీసుకుంటున్న పోలీసులు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడానికి మాత్రం నిమిషాల్లో స్పందిస్తున్నారు.

బీఆర్ఎస్ పక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డి ని, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ని స్పెషల్ టీమ్‌లు పెట్టి మరీ ఇంటి దగ్గరే అరెస్ట్ చేయించారు. ఓదార్పు కోసం వెళ్తున్న నాయకులను నేరస్తుల్లా చూస్తున్న ఈ ప్రభుత్వం నేరస్తులను మాత్రం వదిలేస్తోంది.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టించింది. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మార్చేశారు. మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారుడు శశిధర్ రెడ్డి ఏమో మాది ఖాకీ బుక్ అంటారు.. ప్రస్తుత సీపీ సీవీ ఆనంద్ ఏమో మావోయిస్టులు మంచోళ్లు అంటారు. ఈ మాటలు చెబుతున్న అధికారులు నేరాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు?

నైతిక విలువలు ఉంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి తక్షణమే తన ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులకు రాజీనామా చేయాలి. ఈ కిరాతక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో మిగిలిన వికలాంగ చిన్నారి పేరు మీద ప్రభుత్వం వెంటనే రూ. కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి.

ఆ అమ్మాయిని పెంచి, సంరక్షించే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. పరామర్శకు వెళ్తూ అరెస్టయిన బీఆర్ఎస్ మహిళా నాయకులను వెంటనే విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత

Satyam News

నిన్న BR నాయుడు..ఇవాళ ABN…. జగన్‌ శత్రువులు ఎవరు?

Satyam News

పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు

Satyam News

శిక్షణలో ఉన్న పిల్లల పురోగతిపై ఛార్ట్ లు రూపొందించండి

Satyam News

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు ఇండోనేసియా పురస్కారం

Satyam News

Leave a Comment