రంగారెడ్డిహోమ్

విద్యార్థులతో కలిసి బ్యాట్ పట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్

#Azahrudin

ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా నిలపాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్  అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ఆయన సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా విధానం, క్రీడా సదుపాయాలు, ఆధునిక మౌలిక వసతులను పరిశీలించిన మంత్రి అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు అజారుద్దిన్.

ఈ సందర్భంగా మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లు అభివృద్ధి చెందడం గర్వంగా ఉంద‌న్నారు.  విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలను మరింత పెంచాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని టీపీఎస్ విధానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు మంత్రి.

డిజిటల్ తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలు, లైబ్రరీ, విశాలమైన క్రీడా మైదానాలు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడా సదుపాయాలతో టీపీఎస్ అద్భుతంగా రూపుదిద్దుకుందన్నారు అజారుద్దిన్. తమ చిన్నతనంలో ఇలాంటి వసతులు లేకపోయినా కష్టపడి చదివి జీవితంలో ముందుకు వచ్చామని గుర్తు చేసుకున్న మంత్రి, నేటి విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

విజయం సాధించాలంటే కష్టపడే తత్వం, క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ఎంతో అవసరమని మంత్రి అన్నారు. ఓటమికి నిరాశ చెందకుండా నిరంతర సాధనతో ముందుకు సాగాలని, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను గౌరవించాలని హితవు పలికారు. గురువులను, తల్లిదండ్రులను, తోటి విద్యార్థులను గౌరవించే సంస్కారాన్ని అలవర్చుకోవాలన్న మంత్రి … ఈ టీపీఎస్ నుంచి భవిష్యత్తులో దేశానికి సేవ చేసే వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, ఐఏఎస్ అధికారులు తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

“అజార్… అజార్…” నినాదాలతో మార్మోగిన టీపీఎస్

మంత్రి మహ్మద్ అజహరుద్దీన్‌కు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. “అజార్… అజార్…” అంటూ నినాదాలు చేస్తూ కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ను ప్రత్యక్షంగా చూసిన ఆనందంలో విద్యార్థులు ఉప్పొంగిపోయారు. ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీపడగా, బ్యాట్లు, టీషర్టులు, నోట్‌బుక్స్, క్యాప్‌లపై ఆటోగ్రాఫ్‌లు తీసుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

విద్యార్థులతో కలిసి బ్యాట్ పట్టిన అజార్

విద్యార్థుల అభ్యర్థన మేరకు మంత్రి అజహరుద్దీన్ క్రికెట్ మైదానంలోకి దిగి వారితో కలిసి క్రికెట్ ఆడారు. తనదైన శైలిలో అందమైన కవర్ డ్రైవ్‌లు ఆడుతూ విద్యార్థులను అలరించారు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మెళకువలు, బంతిని ఎలా అంచనా వేయాలి, ఒత్తిడిలో ఎలా ఆడాలి వంటి అంశాలను సరదాగా వివరిస్తూ చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపారు. మాజీ కెప్టెన్‌తో కలిసి క్రికెట్ ఆడిన ఆ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు: అదనపు కలెక్టర్ కిరణ్మయి

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.., తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో డైట్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానం ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే కాకుండా, ఎంచుకున్న ప్రతి రంగంలో అత్యున్నత స్థాయికి చేరడమే నిజమైన విజయమన్నారు కిర‌ణ్మ‌యి.

ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి,డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, మంచాల్ తహసీల్దార్, ఆరుట్ల సర్పంచ్ శోభారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Related posts

గుంక‌లాంలో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

Satyam News

జల విహార్ వద్ద అట్టహాసంగా కైట్ ఫెస్టివల్

Satyam News

చర్చలు ఫలప్రదం… బంధం మరింత పటిష్టం

Satyam News

ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగంపై సదస్సు

Satyam News

కేసీఆర్ ఆనవాళ్లు తుడిచే దమ్ముందా రేవంత్?

Satyam News

మోడీ పై ‘వార్’ మొదలు పెట్టిన డోనాల్డ్ ట్రంప్

Satyam News

Leave a Comment