ప్రపంచంహోమ్

ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

#WarAmerica

చావుదెబ్బతిన్న అమెరికా ఇరాన్ పై ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరగడంతో ఇద్దరు అమెరికా సైనికులు మరణించగా, మరో సైనికుడు గల్లంతైన నేపథ్యంలో ఈ తాజా దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది.

సెంట్‌కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటలకు, భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు దాడులు ప్రారంభమయ్యాయి. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడం, జోర్డాన్‌లో అమెరికా సైనికులపై దాడులకు పాల్పడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) బలగాలను తక్షణమే శిక్షించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని పేర్కొంది.

ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 16 మంది అమెరికా సైనికులు మరణించగా, సుమారు 430 మంది గాయపడినట్లు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. జోర్డాన్‌లో మరణించిన ఇద్దరు సైనికులను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వీరులుగా అభివర్ణిస్తూ, వారి త్యాగం అమెరికా సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని వ్యాఖ్యానించారు.

అమెరికా తాజా దాడుల అనంతరం హోర్ముజ్ జలసంధిని ఆనుకుని ఉన్న ఇరాన్‌లోని సిరిక్ నగరంపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం వెలువడింది. గత కొన్ని రోజులుగా ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలపై అమెరికా దాడుల పరిధి గణనీయంగా విస్తరించింది. బందర్ అబ్బాస్, ఖెష్మ్ ద్వీపం, హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాలతో పాటు అహ్వాజ్, బుషెహర్ ప్రాంతాలు కూడా లక్ష్యంగా మారాయి.

ఇరాన్ మీడియా కథనాల ప్రకారం ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా కొన్ని నివాస ప్రాంతాలపై కూడా ప్రభావం చూపాయి. దీనిపై అధికారికంగా అమెరికా స్పందించలేదు.

మరోవైపు హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని, అమెరికా దాడులు కొనసాగితే ప్రాంతవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మరింత తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సంయుక్తంగా జోర్డాన్, కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై రాత్రిపూట దాడులు నిర్వహించినట్లు ప్రకటించాయి.

ఇరాన్ సైనిక అధికారులు హెచ్చరిస్తూ, అమెరికా దాడులు కొనసాగితే మరింత శక్తివంతమైన ప్రతీకార దాడులు తప్పవని, ఈ యుద్ధం మధ్యప్రాచ్య ప్రాంతానికే పరిమితం కాకుండా మరింత విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు కువైట్‌లోని కీలక చమురు మౌలిక వసతులపై కూడా ఇరాన్ దాడులు జరపడంతో పలువురు గాయపడటంతో పాటు భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.

అమెరికా సైనికుల మరణాల ప్రకటనకు కొద్దిసేపటి ముందు ఇరాన్ అత్యున్నత నాయకత్వం కూడా అమెరికాకు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా దాడులు కొనసాగితే మరచిపోలేని పాఠం నేర్పుతామని ప్రకటించడంతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను చెల్లనివిగా అభివర్ణించింది. అలాగే సుమారు నెల క్రితం యుద్ధ విరమణ దిశగా కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని తమ బాధ్యతలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ చర్చల ప్రతినిధి ప్రకటించడం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది.

Related posts

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

Satyam News

ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు కొనసాగిస్తాం

Satyam News

నెహ్రూపై విషం చిమ్ముతున్న పాలక పార్టీ

Satyam News

కడపలో వైకాపాకు భారీ షాక్..

Satyam News

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

Satyam News

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

Satyam News

Leave a Comment