పేద విద్యార్ధులకు చదువులు భారం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ ద్వారా .. చదువుకొనే విద్యార్ధుల తల్లులకు ఆర్ధిక సహాయం అందజేస్తున్నారు.
ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్ధులందరికీ వరుసగా రెండో ఏడాది.. తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు. 42 లక్షల 70 వేల మంది తల్లుల అకౌంట్లలో.. 67 లక్షల 47 వేల మంది పిల్లలకు ఒక్కొక్కరికీ 15 వేల చొప్పున మొత్తం 10,120 కోట్ల ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నవరత్నాల హామీల్లో భాగంగా అమ్మ ఒడి స్కీమ్‌ని అమలు చేశారు. అప్పటి అమ్మ ఒడి పథకాన్ని.. నేటి తల్లికి వదనం పథకాన్ని పోల్చుకొని.. ఏ స్కీమ్ వల్ల తల్లులకు ఎక్కువ లాభం కలుగుతుందని సామాన్య ప్రజల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీ హయాంలో ఎంత మందికి.. ఎంత మొత్తం ఇచ్చారు.. కూటమి పాలనలో, ఎంత ఇస్తున్నారో తెలుసుకుంటే.. ఏ స్కీమ్ వల్ల ఎక్కువ లాభమో క్లారిటీ వస్తుంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2020 జనవరిలో తొలి విడత అమ్మ ఒడి స్కీమ్ నిధులు విడుదల చేసింది.
42 లక్షల 33 వేల మంది తల్లుల ఖాతాల్లో 6,349 కోట్లు జమ చేశారు. 2021 జనవరిలో రెండోసారి 44 లక్షల 48 వేల మంది తల్లుల ఖాతాల్లో 6,673 కోట్లు డిపాజిట్ చేశారు. మూడో విడత కింద 2022 జూన్‌లో 43 లక్షల 96 వేల మందికి 6,595 కోట్లు అందించారు. 2023 జూన్‌లో చివరి సారి 42.61 లక్షల మంది తల్లులకు.. 6,392 కోట్లు ఇచ్చారు.
మొత్తం ఐదేళ్ల పాలనలో నాలుగు సార్లు మాత్రమే అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందించారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా.. ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. ఒక కుటుంబంలో ఒక విద్యార్ధికి మాత్రమే 15 వేల చొప్పున ఇచ్చారు. ఇందులో టాయిలెట్, స్కూల్ డెవలప్‌మెంట్ ఫండ్ కోసమని 2 వేలు ముందే మినహాయించుకొని.. ఒక్కొక్కరికీ 13 వేల ఇచ్చారు. ఆ విధంగా ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం 26 వేల కోట్లు.
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పధకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే… వారందరికీ 15 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తోంది. 2025లో ఈ స్కీమ్ ద్వారా 42 లక్షల 69 వేల మంది తల్లులకు తల్లికి వందనం స్కీమ్ అమలు చేశారు. మొత్తం 67 లక్షల 27 వేల మంది పిల్లలకు 10 వేల 90 కోట్ల రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
2026లో 67 లక్షల 47 వేల మంది పిల్లలకు 10 వేల 120 కోట్ల రూపాయలు అందించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం చదువుకొనే పిల్లల తల్లులకు 20 వేల 200 కోట్లు సాయం చేసింది. అంటే జగన్ సర్కారు నాలుగేళ్లలో 26 వేల కోట్లు ఇస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే 20 వేల కోట్లు ఇచ్చింది. ఐదేళ్లలో ఈ మొత్తం 50 వేల కోట్లు దాటిపోతుంది.
ఈ లెక్కన వైసీపీ హాయంలో అమ్మ ఒడి పథకం ద్వారా ఇచ్చిన మొత్తం కంటే తల్లికి వందం స్కీమ్ ద్వారా తల్లులకు రెండు రెట్లు ఎక్కువ లాభం చేకూరుతుంది. దాదాపుగా ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి.. జగన్ హయాంలో ఒకరికే ఇవ్వడం వల్ల.. ఇప్పుడు గతం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ లాభం కలుగుతోంది. సూపర్ సిక్స్ హామీల అమలుతో సంక్షేమ పథకాల్లోనూ కూటమి ప్రభుత్వం.. వైసీపీ రికార్డును భారీ తేడాతో బీట్ చేస్తోంది.
