హైదరాబాద్హోమ్

అధికారం కంటే బాధ్యతే ముఖ్యం: అమిత్‌ షా

#AmitShah

దేశ అంతర్గత భద్రతలో మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు యువ ఐపీఎస్‌ అధికారులు సిద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. అధికారాన్ని హోదాగా కాకుండా బాధ్యతగా భావించాలని, ప్రచారానికి దూరంగా ఉంటూ ఫలితాలపైనే దృష్టి సారించాలని సూచించారు.

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ 78వ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ పరేడ్‌ను సమీక్షించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్‌ షా పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ 78వ బ్యాచ్‌లో భాగంగా మొత్తం 151 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 135 మంది ఐపీఎస్‌ అధికారులు కాగా, మరో 16 మంది నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులకు చెందిన అధికారులు కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ బ్యాచ్‌లో 37 మంది మహిళా అధికారులు ఉండటం విశేషం.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ పరేడ్‌ను సమీక్షించారు. అధికారుల కవాతు, క్రమశిక్షణ, సమన్వయాన్ని పరిశీలించారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు అందజేశారు. ఈ బ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది మంది, తెలంగాణకు ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను కేటాయించారు.

పనితీరు ద్వారా గుర్తింపు పొందాలి

పోలీసు అధికారులకు అధికారం కంటే బాధ్యతే ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన సందేశంలో స్పష్టం చేశారు. ఆయన పంపిన సందేశాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా చదివి వినిపించారు. పోలీసు అధికారులు ప్రచారానికి దూరంగా ఉంటూ, పనితీరు ద్వారా గుర్తింపు పొందాలని అమిత్‌ షా సూచించారు.

వినయం, సంయమనం, రాజ్యాంగంపై నిబద్ధత పోలీసు అధికారులకు బలమని పేర్కొన్నారు. కొత్త నేర న్యాయ చట్టాల స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఆధునిక సాంకేతికత, ఫోరెన్సిక్‌ విజ్ఞానంతో దర్యాప్తును మరింత పటిష్ఠం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌ విధానాన్ని కొనసాగిస్తూ, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. సరిహద్దుల భద్రతలో సాంకేతికత, నిఘా వ్యవస్థల సమన్వయం కీలకమని పేర్కొన్నారు.

నషా ముక్త్‌ భారత్‌ లక్ష్య సాధనకు కృషి

భవిష్యత్తులో పోలీసు అధికారులు ఎదుర్కోవాల్సిన ఐదు ప్రధాన సవాళ్లను కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ వివరించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను ఛేదిస్తూ, నషా ముక్త్‌ భారత్‌ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. రెండోది సైబర్‌ నేరాలు, మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు, నకిలీ సిమ్‌ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు రాష్ట్రాల స్థాయిలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

దేశీయంగా ఉద్భవించే, విదేశాల నుంచి ప్రేరణ పొందే ఉగ్రవాద ముప్పులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అక్రమ విదేశీయుల గుర్తింపు, చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తూ నేరాలకు పాల్పడేవారిని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సాంకేతికత సాయంతో డార్క్‌నెట్‌, క్రిప్టో లావాదేవీలు, వీపీఎన్​ వంటి మార్గాలను ఉపయోగించే నేరగాళ్లను పట్టుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.

శాంతిభద్రతలకు సవాలుగా సాంకేతికత

సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సోషల్‌ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ సందేశాలు, డీప్‌ఫేక్‌ వీడియోలు కూడా శాంతిభద్రతలకు సవాళ్లుగా మారుతున్నాయని గోవింద్‌ మోహన్‌ పేర్కొన్నారు. వీటివల్ల ప్రజల్లో అనవసరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసింగ్‌లో కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచుకోవాలని స్పష్టం చేశారు

Related posts

డాక్టర్ ప్రియాంకపై దాడిని ఖండించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

Satyam News

భవిష్యత్తు అవసరాలకే తెనాలి రోడ్డు విస్తరణ

Satyam News

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

Satyam News

అసమానతలను రూపుమాపి రాజ్యాంగ విలువలను కాపాడాలి

Satyam News

ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్‌ ను అధిగమించవచ్చు

Satyam News

చేదుకో కోటయ్య…. కిటకిటలాడుతున్న కోటప్పకొండ

Satyam News

Leave a Comment