పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారత్ తదుపరి చర్యలు తీసుకుంటున్నది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక నిపుణుల కమిటీ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చెనాబ్ నదిపై ప్రతిపాదిత 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–II జలవిద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.
ఈ నిర్ణయం ఈ నెల ప్రారంభంలో జరిగిన హైడల్ ప్రాజెక్టులపై నిపుణుల అంచనా కమిటీ 45వ సమావేశంలో తీసుకున్నారు. దీంతో ఈ రన్-ఆఫ్-ది-రివర్ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ టెండర్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.3,200 కోట్లకు పైగా ఉండనుందని అంచనా. చెనాబ్ బేసిన్ నీటిని సింధు జలాల ఒప్పందం–1960 ప్రకారం భారత్, పాకిస్థాన్ పంచుకుంటున్నాయి.
ప్రాజెక్టు నీటి వినియోగం ఆ ఒప్పందానికి అనుగుణంగా రూపొందించారు. అయితే, 2025 ఏప్రిల్ 23 నుంచి సింధు జలాల ఒప్పందం అమల్లో లేదని కూడా కమిటీ స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో, సింధు, జీలం, చెనాబ్ నదులపై పాకిస్థాన్‌కు హక్కులు ఉండగా, రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు ఉండేవి.
ప్రస్తుతం ఒప్పందం నిలిపివేయబడిన నేపథ్యంలో, సావల్‌కోటె, రట్లే, బర్సర్, పాకల్ దుల్, క్వార్, కిరు, కిర్తాయి–I, కిర్తాయి–II వంటి అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. దుల్హస్తీ స్టేజ్–II ప్రాజెక్టు, 2007 నుంచి విజయవంతంగా పనిచేస్తున్న 390 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్–I జలవిద్యుత్ ప్రాజెక్టుకు విస్తరణగా రూపొందించారు.
ఈ స్టేజ్–II కోసం స్టేజ్–I పవర్ స్టేషన్ నుంచి 3,685 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వ్యాసంతో కూడిన ప్రత్యేక సొరంగం ద్వారా నీటిని మళ్లించి గుర్రపు ఆకారంలో ఉన్న ఒక కొలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో సర్జ్ షాఫ్ట్, ప్రెజర్ షాఫ్ట్, అలాగే భూగర్భంలో పవర్ హౌస్ కూడా ఉంటాయి. ఇందులో రెండు 130 మెగావాట్ల యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం 260 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం సాధించనున్నారు.
దీని ద్వారా వార్షికంగా భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 60.3 హెక్టార్ల భూమి అవసరం కాగా, అందులో 8.27 హెక్టార్ల ప్రైవేట్ భూమిని కిష్త్వార్ జిల్లాలోని బెంజ్‌వార్, పల్మార్ అనే రెండు గ్రామాల నుంచి సేకరించాల్సి ఉంటుంది.
