ముఖ్యంశాలుహోమ్

రూ. 2500 కోట్ల ఇసుక దందా….. తీగ లాగుతున్న ED!

#Jagan

వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అడ్డగోలు ఇసుక దోపిడీపై ED కొరడా ఝుళిపించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఎండీ వెంకటరెడ్డి సహకారంతో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాల కేసులో ఈడీ అధికారులు పలుచోట్ల మెరుపు దాడులు చేశారు.

హైదరాబాద్‌లో మూడు, రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు, తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఓ చోట ఈ సోదాలు ముమ్మరంగా సాగాయి. ఈ దాడుల్లో కీలక పత్రాలతో పాటు పలు హార్డ్ డిస్క్‌లను అధికారులు సీజ్ చేశారు. వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాల ముసుగులో అధికార పార్టీ నేతలు ఏకంగా రూ.2,566 కోట్లు వెనకేసుకున్నారని, ఈ భారీ కుంభకోణానికి వెంకటరెడ్డే తెర వెనుక సహకరించారని ఏపీ ACB 2024లోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ భారీ స్కామ్‌లో APMDC మాజీ ఎండీ వెంకటరెడ్డిని ACB A-1గా చేర్చింది. ఆయనతో పాటు ఈ దోపిడీలో భాగస్వాములైన జయ్‌ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ప్రతినిధి అనిల్‌ ఆత్మారామ్‌ కామత్, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ప్రతినిధి పి.అనిల్‌కుమార్, GCKC ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి ఆర్‌.వెంకట కృష్ణారెడ్డిలను కూడా నిందితులుగా చేర్చారు.

జేపీవీఎల్, ప్రతిమ, జీసీకేసీ సంస్థలను కూడా ఈ కేసులో ముద్దాయిలుగా పేర్కొన్నారు. ACB కేసు నమోదు చేయగానే గుట్టుచప్పుడు కాకుండా పారిపోయిన వెంకటరెడ్డి..దాదాపు రెండున్నర నెలల పాటు ఢిల్లీలో తలదాచుకున్నారు. ఎట్టకేలకు ఆయనను అధికారులు పట్టుకుని అరెస్ట్ చేయడంతో అసలు బాగోతం వెలుగులోకి రావడం మొదలైంది.

ఇక వెంకటరెడ్డి హయాంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలు అన్నీ ఇన్నీ కావు. 2021లో అప్పటి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు ఇష్టానుసారంగా పరిమితికి మించి ఇసుకను తోడేస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించేందుకు వీలుగా..నిబంధనలకు విరుద్ధంగా చేతిరాతతో కూడిన వేబిల్లులు వాడుకునేందుకు ఆయన పచ్చజెండా ఊపారు.

నిబంధనల ప్రకారం ప్రతినెలా 1, 16 తేదీల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాయిదాలను ఆయా సంస్థలు ఎగ్గొడుతున్నా వెంకటరెడ్డి వారిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు. మరీ దారుణం ఏమిటంటే..JPVL సంస్థ ప్రభుత్వానికి ఏకంగా రూ.800 కోట్ల మేర బకాయి పడినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. పైగా ఆ సంస్థ సమర్పించిన రూ.120 కోట్ల బ్యాంకు గ్యారంటీని దర్జాగా వెనక్కి తీసుకునేందుకు దగ్గరుండి మరీ సహకరించడం ఆయన అవినీతికి పరాకాష్ట.

నిబంధనల ప్రకారం JPVL సంస్థ ఇసుక తవ్వకాల గడువు 2023 మే నెలతోనే ముగిసిపోయింది. అయినా సరే, నవంబర్ వరకు యథేచ్ఛగా, అనధికారికంగా ఇసుక దోపిడీ చేసుకునేందుకు వెంకటరెడ్డి అక్రమంగా అనుమతినిచ్చారు.

ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి కోణంపై ఏపీ ACB ముమ్మరంగా దర్యాప్తు చేస్తుండగా.. నిధుల మళ్లింపు వ్యవహారాలపై హైదరాబాద్‌ ED విభాగం మరో కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే బుధవారం వెంకటరెడ్డి, ఆయన బంధువుల నివాసాలతో పాటు దోపిడీలో భాగస్వాములైన JPVL , ప్రతిమ, GCKC సంస్థల కార్యాలయాల్లో ED అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాలతో గత వైసీపీ ప్రభుత్వ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Related posts

ఇరాన్ పై పాశవిక దాడి: 25 మంది పౌరులు మృతి

Satyam News

జర్నలిస్టుల హెల్త్ కార్డుల సమస్య త్వరలో పరిష్కరిస్తా

Satyam News

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే తో వనపర్తి చిన్నారెడ్డి

Satyam News

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Satyam News

కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి తీపికబురు

Satyam News

జగన్ రెడ్డి విధ్వంసకర పాలన ముగిసి రెండేళ్ళు

Satyam News

Leave a Comment