25.2 C
Hyderabad
September 20, 2026
చిత్తూరుహోమ్

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచిచూసే సమయం తగ్గి, ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఈ సేవలో ఉన్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులు నిర్వహిస్తూ, ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సు సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది.

రోజుకు 60 వేల మంది భక్తులు సురక్షితంగా ప్రయాణం

బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియజేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60 వేల మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు.

గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియకపోవడంతో భక్తులు ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్ లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

ఇందుకుగాను హైదరాబాద్ కు చెందిన బి.ఎస్.టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ఎంతో ఉపయోగరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ తోడ్పాటు

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీని తగ్గించి కాలుష్య నియంత్రణ దిశగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి, భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది.

భక్తుల కోసం రాత్రుల్లో అదనంగా 20 ట్రిప్పులు

ప్రస్తుతం రాత్రి 9 నుండి ఉదయం 5 ఐదు గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచనున్నారు.

అదే విధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Related posts

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ధర్మేంద్ర

Satyam News

ఘనంగా వట్పల్లి హజ్రత్ దర్గా షరీఫ్ ఆరాధన

Satyam News

రామడుగులో తెలంగాణ విమోచన దినం

Satyam News

అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ కేంద్రం

Satyam News

ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురండి

Satyam News

జగన్ కోటరీపై ఈడీ పంజా…!

Satyam News

Leave a Comment