జాతీయంహోమ్

లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

OMBirla

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. సభ వ్యవహారాలను నిర్వహించడంలో స్పీకర్ బహిరంగంగా పక్షపాత వైఖరి అవలంబించారని, రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలపై స్పష్టంగా తప్పుడు ఆరోపణలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

కాంగ్రెస్ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గోగోయ్, చీఫ్ విప్ కె.సురేష్, విప్ మొహమ్మద్ జావేద్‌లు కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, డీఎంకే సహా పలు ప్రతిపక్ష పార్టీల తరఫున లోక్‌సభ కార్యదర్శి జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌కు ఈ నోటీసును అందజేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ నోటీసుపై సంతకం చేయలేదని, ఈ చర్యలో భాగస్వాములు కాదని తెలిసింది.

ఈ తీర్మానం ఇండియా కూటమి లోపల విస్తృత సంప్రదింపుల అనంతరం తీసుకున్న నిర్ణయమని ప్రతిపక్ష నేతలు తెలిపారు. మొత్తం 100 మంది ఎంపీల సంతకాలు ఉన్నాయని, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్పీ) తదితర పార్టీల మద్దతు ఉందని వారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సి) ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

ప్రతి పక్షాలకు మాట్లాడే ఛాన్సే ఇవ్వడం లేదు

పలుమార్లు ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఇది పార్లమెంట్‌లో వారి మౌలిక ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించడమేనని నోటీసులో ఆరోపించారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని పూర్తిచేయడానికి అనుమతించలేదని పేర్కొన్నారు.

ఇది ఒక్కసారిగా జరిగిన ఘటన కాదని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతకు దాదాపు ఎప్పుడూ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫిబ్రవరి 3న ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను బడ్జెట్ సమావేశాల మొత్తం కాలానికి ఏకపక్షంగా సస్పెండ్ చేశారని, తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకున్నందుకే వారికి శిక్ష విధించారని నోటీసులో పేర్కొన్నారు.

లోక్ సభలో తప్పుడు సంకేతాలు ఇచ్చిన స్పీకర్

అలాగే, కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ సీటువైపు వెళ్లి ఏదో అనూహ్య చర్యకు పాల్పడవచ్చని తనకు ‘స్పష్టమైన సమాచారం’ ఉందంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలను కూడా నోటీసు ప్రస్తావించింది. ఆ కారణంతోనే ప్రధాని సభకు వచ్చి రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానం ఇవ్వవద్దని తాను కోరినట్లు స్పీకర్ చెప్పిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ సభ్యులపై స్పష్టంగా తప్పుడు, అవమానకరమైన ఆరోపణలని, సభా నియమాలు, పార్లమెంటరీ సంప్రదాయాల రక్షకుడిగా ఉండాల్సిన స్పీకర్ స్వయంగా సభలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేసినట్టేనని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు ఇవ్వాలన్న నిర్ణయం సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఖరారైనట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

పార్లమెంటులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, అధికార పక్షానికి అనుకూలంగా స్పీకర్ జోక్యాలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆ సమావేశంలో చర్చ జరిగినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ ప్రవర్తన పార్లమెంటరీ నిబంధనలను అతిక్రమించిందని, ముఖ్యంగా ప్రతిపక్ష నేతకు ప్రతిస్పందనకు అవకాశం ఇవ్వకుండా, ఖజానా బెంచీల సభ్యులకు మాత్రం దీర్ఘంగా మాట్లాడేందుకు అనుమతించారని ప్రతిపక్షాలు మరోసారి ఆరోపించాయి.

Related posts

అనుకూల తీర్పు రావాలంటే లంచం?

Satyam News

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తాం

Satyam News

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే

Satyam News

సాగునీటి సంఘాల అధ్యక్షులతో త్వరలో సమావేశం

Satyam News

Leave a Comment