హైదరాబాద్హోమ్

పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్ ప్రారంభం

#VenkaiahNaidu

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న స్టార్ క్యాన్సర్ సెంటర్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేక “పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్”ను భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం ప్రారంభించారు. సమగ్ర క్యాన్సర్ చికిత్సతో పాటు ప్రత్యేక పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సేవలను నేరుగా అందిస్తున్న హైదరాబాద్‌లోని తొలి ప్రైవేట్ ఆసుపత్రిగా స్టార్ హాస్పిటల్స్ నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ చైర్మన్, వ్యవస్థాపక ప్రమోటర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, డైరెక్టర్, వ్యవస్థాపక ప్రమోటర్ డాక్టర్ రమేష్ గూడపాటి, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సాయినాథ్ బెతనాభొట్ల, సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ విపిన్ గోయల్, మాజీ డైరెక్టర్ జైరాజ్ కుమార్, సామాజికవేత్త ప్రదీప్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, క్యాన్సర్ చికిత్సలో నొప్పి నివారణ, పాలియేటివ్ కేర్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. పాలియేటివ్ కేర్ అనేది చివరి దశలో మాత్రమే అందించే సేవ కాదని, వ్యాధి నిర్ధారణ జరిగిన తొలి దశ నుంచే ప్రధాన చికిత్సలతో పాటు అందించాల్సిన సమగ్ర వైద్య విధానమని పేర్కొన్నారు. ముందస్తు పరీక్షలు, అవగాహన, సమయానికి నిర్ధారణ ద్వారా అనేక రకాల క్యాన్సర్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చని చెప్పారు.

కొత్తగా ప్రారంభించిన ఈ విభాగంలో క్యాన్సర్ నిర్ధారణ జరిగిన ప్రారంభ దశ నుంచే నొప్పి, ఇతర లక్షణాల నియంత్రణకు ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు. కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సలతో సమాంతరంగా ఈ సేవలు కొనసాగుతాయి. అధునాతన నొప్పి నివారణ పద్ధతులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ఆధారిత చికిత్సలు, మానసిక మద్దతు, పోషకాహార సలహాలు, పునరావాస సేవలు, అత్యవసర నొప్పి నిర్వహణ వంటి సమగ్ర సేవలను ఒకే వేదికపై అందించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

క్యాన్సర్ రోగుల సేవలో విశేష కృషి చేసిన పలువురు వైద్యులు, సేవాభావంతో పనిచేసిన వ్యక్తులను ఈ సందర్భంగా సన్మానించారు. పేద క్యాన్సర్ రోగుల చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరిని గౌరవించారు. వెయ్యి ఉచిత క్యాన్సర్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన స్టార్ హాస్పిటల్స్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ గౌడ శ్రీహరికి ప్రత్యేక సన్మానం చేశారు. ప్రభుత్వ రంగంలో పాలియేటివ్ కేర్ సేవల అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి పలాట్‌ను కూడా ఘనంగా సత్కరించారు. రోగుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న స్టార్ హాస్పిటల్స్ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందించి సన్మానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ సాయినాథ్ బెతనాభొట్ల మాట్లాడుతూ, క్యాన్సర్ సంరక్షణ అంటే కేవలం ఆయుష్షును పెంచడం మాత్రమే కాదని, ప్రతి రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కూడా అంతే ముఖ్యమన్నారు. డాక్టర్ విపిన్ గోయల్ మాట్లాడుతూ, శస్త్రచికిత్సతో పాటు నొప్పి నివారణ, రోజువారీ జీవన సౌలభ్యం కల్పించడం కూడా సమగ్ర చికిత్సలో భాగమని చెప్పారు. డాక్టర్ రమేష్ గూడపాటి మాట్లాడుతూ, వైద్య నైపుణ్యంతో పాటు మానవీయ విలువలను కలిపే లక్ష్యంతోనే ఈ సేవలను ప్రారంభించామని తెలిపారు. డాక్టర్ గోపీచంద్ మన్నం మాట్లాడుతూ, శారీరక, మానసిక, సామాజిక కోణాలన్నింటినీ స్పృశించే సమగ్ర వైద్య విధానమే నిజమైన ఆరోగ్య సంరక్షణ అని పేర్కొన్నారు.

Related posts

ఈడబ్ల్యూఎస్ క్రెడిట్ కో అపరేటివ్ సొసైటీల ఏర్పాటు

Satyam News

రాంగోపాల్ వర్మ ఇన్ అండ్ యాజ్ “మ్యాడ్ మాన్స్టర్”

Satyam News

CII సమ్మిట్ గ్రాండ్ సక్సెస్‌..బాబు, లోకేష్‌ సూపర్‌..

Satyam News

16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

Satyam News

తీసేసిన ఓటర్ల పేర్లు ప్రకటించిన ఎన్నికల సంఘం

Satyam News

మకర సంక్రాంతి తేదీపై వివాదం: పుణ్యకాలం పోతే పండగ ఎందుకు?

Satyam News

Leave a Comment