ఇక లీక్ వీరులకు కష్టకాలమే. పరీక్షా పత్రాలు లీక్ చేసేవారికి 10 ఏళ్లు జైలు శిక్ష విధించేలా లోక్ సభ నిర్ణయించింది. దేశంలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది.
ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జూలై 27న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల అనంతరం, విద్యాశాఖలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లు తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బిల్లుపై చర్చ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. 2024లో యాంటీ పేపర్ లీక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 52 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కూడా కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి దర్యాప్తు చేపట్టిందని పేర్కొన్నారు.
ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య బిల్లు ఆమోదం పొందింది. ఈ సవరణతో ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి మరింత కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని బలోపేతం చేసినట్లు అయింది.
అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ చట్టాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామని మంత్రి వివరించారు. ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇటీవలి సంవత్సరాల్లో పేపర్ లీక్‌లకు సంబంధించిన ఆత్మహత్యల రేటు కూడా తగ్గినట్లు తెలిపారు.
సవరణ బిల్లు ప్రకారం, ప్రశ్నాపత్రాల లీకేజీలు లేదా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, అభ్యర్థుల విశ్వాసాన్ని కాపాడడం, అక్రమాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.
చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కూడా జితేంద్ర సింగ్ విమర్శలు చేశారు. పార్లమెంటరీ విధివిధానాలు, ప్రభుత్వ పనితీరుపై ఆయనకు సరైన అవగాహన లేదని వ్యాఖ్యానించారు.
