ముఖ్యంశాలుహోమ్

వచ్చే వారం కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం

#SrisailamDam

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించి వచ్చే వారంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సమావేశం కానున్నాయి.

తెలుగు రాష్ట్రాల నీటి అంశాలకు సంబంధించి వచ్చే వారం రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాల వాటాకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన పరస్పర ఫిర్యాదులు, పోలవరం, టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు సహా ఇతర అంశాలు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి.

ఈనెల 26న కేఆర్​ఎంబీ సమావేశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు సంబంధించిన అంశాలు మరోమారు చర్చనీయాంశం కానున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం, రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల అనుమతులు, పరస్పర ఫిర్యాదులపై చర్చించేందుకు ఈ నెలలో రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, 30వ తేదీన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఇంజనీర్లు పాల్గొననున్నారు. ఇప్పటికే పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో జరిగే చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం

కృష్ణా నదీ జలాల పంపిణీ అంశం మరోసారి కేఆర్‌ఎంబీ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై ఇటీవల జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. రెండు రాష్ట్రాలు తమ వాదనలను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటి వరకు 66, 34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఏపీ అంటోంది. తెలంగాణ మాత్రం విభేదిస్తోంది. కృష్ణా బేసిన్ అధికంగా ఉన్నందున అందుకు అనుగుణంగా కేటాయింపులు జరగాలని అంటోంది. 70, 30 నిష్పత్తిన కృష్ణా జలాలు వినియోగించుకోవాలని తెలంగాణ కోరుతోంది. రెండు రాష్ట్రాల భిన్న వాదనల నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశంలో జరగనున్న చర్చ కీలకం కానుంది.

ఆ అంశాలపై చర్చ జరిగే అవకాశం

ఎల్‌నినో ప్రభావం, వర్షభావ పరిస్థితులు, జలాశయాల్లో కొద్దిపాటి ప్రవాహాల నేపథ్యంలో నీటి నిర్వహణ కీలకంగా మారింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని త్రిసభ్య కమిటీ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, భవిష్యత్తు అవసరాలు, నీటి విడుదలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. సాగునీటి అవసరాలతోపాటు పట్టణాలు, గ్రామాల తాగునీటి అవసరాలను సమన్వయం చేసుకోవడం కూడా కీలకంగా మారింది. రెండు రాష్ట్రాల నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై పరస్పరం అభ్యంతరాలు ఉన్నాయి.

టెలిమెట్రీల ఏర్పాటుపై

గతంలో కృష్ణా బోర్డుకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. దాంతో ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగం, ఇతర అభ్యంతరాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఇప్పటికే బోర్డులకు ఫిర్యాదులు చేశాయి.

ప్రాజెక్టుల అనుమతులు, నీటి వినియోగం, నిబంధనల అమలు వంటి అంశాలపై పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. బోర్డు సమావేశాల్లో ఆయా ఫిర్యాదులను ప్రస్తావించి, సంబంధిత అంశాలపై స్పష్టత కోరే అవకాశం ఉంది. ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల స్థితి, బోర్డుల పరిధి, రాష్ట్రాలు పాటించాల్సిన మార్గదర్శకాలు వంటి అంశాలపై కూడా సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.

నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశం కూడా సమావేశాల్లో ప్రస్తావనకు రానుంది. గతంలో కొన్ని చోట్ల ఏర్పాటు చేసినప్పటికీ అందులో కొన్ని సరిగ్గా పనిచేయడం లేదు. వాటి స్థానంలో కొత్తగా ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. దీంతో నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు అంశంపై కూడా చర్చ జరగనుంది.

నిధుల అంశంపై చర్చ జరిగే అవకాశం

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నిర్వహణ, బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. బోర్డులకు రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధుల అంశంపై చర్చ జరగనుంది. ఈనెల 30న జరిగే గోదావరి బోర్డు సమావేశంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్స్‌ అంశం కూడా ప్రస్తావకు వచ్చే అవకాశం ఉంది.

పోలవరం ప్రాజెక్టు కారణంగా ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు, ముంపు ప్రభావం, సంబంధిత ప్రాంతాలపై పడే పరిణామాలపై గతంలోనే తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు అథారిటీ గతంలో తెలిపింది. జీఆర్ఎంబీ సమావేశంలో ఆ అంశంపై మరోమారు చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితోపాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అంశాలు కూడా.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో చర్చకు రానున్నాయి.

Related posts

మహోజ్వలంగా వెలగనున్న బాసర శ్రీ సరస్వతీ దేవాలయం

Satyam News

ఆంధ్ర ప్రదేశ్ లో 2 ఫేక్ యూనివర్సిటీలు

Satyam News

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

Satyam News

ప్రతి నియోజకవర్గంలో మహిళ దినోత్సవ వేడుకలు

Satyam News

ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన సజ్జల

Satyam News

దీపావళి జోష్: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు

Satyam News

Leave a Comment