25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

ట్రంప్ హెచ్చరికలతో వణుకుతున్న ఇరాన్

#DonaldTrump

ఇరాన్ పై ప్రత్యక్ష చర్యలకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో తాము చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలపై తీవ్ర అణచివేత నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ హెచ్చరిక జారీ చేశారు. దాంతో వాషింగ్టన్‌తో చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

నిరసనకారులపై దాడులు కొనసాగితే ఇస్లామిక్ రిపబ్లిక్‌పై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించిన తర్వాత ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఇదే సమయంలో, దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య కనీసం 544కి చేరిందని కార్యకర్తలు సోమవారం తెలిపారు. ఈ వార్తపై ఇరాన్ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు. అయితే, వాషింగ్టన్– టెహ్రాన్ మధ్య గతంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఒమాన్ విదేశాంగ మంత్రి ఈ వారాంతంలో ఇరాన్‌ను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, ఇరాన్ ఏమి హామీ ఇవ్వగలదన్నది ఇంకా స్పష్టంగా లేదు. ముఖ్యంగా అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థపై ట్రంప్ కఠిన డిమాండ్లు పెట్టగా, ఇవి తమ జాతీయ రక్షణకు కీలకమని ఇరాన్ వాదిస్తోంది. టెహ్రాన్‌లో విదేశీ దౌత్యవేత్తలతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, “పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది” అని వ్యాఖ్యానించారు. నిరసనల్లో చోటుచేసుకున్న హింసకు ఇజ్రాయెల్, అమెరికానే కారణమని ఆరోపించారు.

ఇందుకు ఆధారాలు మాత్రం చూపలేదు. “అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకునేందుకు ఒక కారణం కల్పించేందుకే ఈ నిరసనలు హింసాత్మకంగా, రక్తపాతంగా మారాయి” అని అరాఘ్చీ చెప్పారు. ఖతార్ మద్దతుతో నడిచే అల్ జజీరా నెట్‌వర్క్ ఈ వ్యాఖ్యలను ప్రసారం చేసింది.

ఇంటర్నెట్ నిలిపివేసినప్పటికీ, అల్ జజీరాకు దేశంలో ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి ఉంది. ఇదిలా ఉండగా, సోమవారం ఇరాన్ ప్రభుత్వం తమ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి థియోక్రసీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చింది. 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనీ పాలనను నేరుగా సవాల్ చేస్తూ రోజులు తరబడి సాగిన నిరసనల అనంతరం ఇది శక్తి ప్రదర్శనగా భావిస్తున్నారు.

ప్రభుత్వ టెలివిజన్ ప్రసారాల్లో “అమెరికాకు మరణం”, “ఇజ్రాయెల్‌కు మరణం” అంటూ నినాదాలు చేసిన జనసమూహం కనిపించింది. ఇరాన్‌పై సైబర్ దాడులు నుంచి అమెరికా లేదా ఇజ్రాయెల్ నేరుగా దాడులు చేయడం వరకు వివిధ చర్యలను ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం పరిశీలిస్తున్నట్టు వైట్ హౌస్ అంతర్గత చర్చలపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. “సైన్యం దీనిపై పరిశీలిస్తోంది.

మేము చాలా కఠినమైన ఎంపికలను పరిగణలోకి తీసుకుంటున్నాం” అని ట్రంప్ ఆదివారం రాత్రి ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో చెప్పారు. ఇరాన్ ప్రతీకార బెదిరింపులపై ప్రశ్నించగా, “వారు అలా చేస్తే, ఇంతకు ముందు ఎప్పుడూ ఎదురుకాని స్థాయిలో మేము దాడి చేస్తాం” అని హెచ్చరించారు. “అమెరికా చేతిలో దెబ్బలు తిని వారు అలసిపోయారని నేను అనుకుంటున్నాను. ఇరాన్ చర్చలకు రావాలని కోరుకుంటోంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

పది వేల మందికి పైగా అరెస్టు

గత రెండు వారాల్లో జరిగిన నిరసనల నేపథ్యంలో 10,600 మందికి పైగా అరెస్టయ్యారని, అమెరికా కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మృతుల్లో 496 మంది నిరసనకారులు కాగా, 48 మంది భద్రతా దళాలకు చెందినవారు. ఇరాన్‌లో ఇంటర్నెట్, ఫోన్ లైన్లు నిలిపివేయడంతో విదేశాల నుంచి పరిస్థితిని అంచనా వేయడం మరింత కష్టమైంది.

ఇరాన్ ప్రభుత్వం కూడా మొత్తం ప్రాణనష్టాలపై అధికారిక గణాంకాలు విడుదల చేయలేదు. సమాచార బ్లాక్‌అవుట్ వల్ల ఇరాన్ భద్రతా దళాల్లోని వారు మరింత రక్తపాత అణచివేతకు పాల్పడే అవకాశం ఉందని విదేశాల్లో ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాజధాని టెహ్రాన్‌తో పాటు రెండో అతిపెద్ద నగరంలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు.

ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకూ మరిన్ని నిరసనలు జరిగాయని చూపే వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. డిసెంబర్ 28న ఇరాన్ కరెన్సీ రియాల్ కుప్పకూలడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌కు 14 లక్షల రియాళ్లకు పైగా మారకం జరుగుతోంది. అణు కార్యక్రమం కారణంగా విధించిన అంతర్జాతీయ ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆర్థిక ఆగ్రహంతో మొదలైన ఈ నిరసనలు క్రమంగా ఇరాన్ థియోక్రసీని నేరుగా సవాల్ చేసే స్థాయికి చేరుకున్నాయి.

Related posts

కొత్త కోడలిపై కిరాతకం: దుర్గమ్మతో ఆటలు…

Satyam News

పులివెందుల దెబ్బ.. ఏపీలో జగన్‌ మిస్సింగ్…!!

Satyam News

మధ్యాహ్న భోజనంలో అవినీతి మరకలు

Satyam News

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News

దేవదేవుడికి అపచారం చేశాం: రోజా, జోగి టాక్ లీక్

Satyam News

డొమినోస్ పిజ్జా బిజినెస్ లైసెన్సు సస్పెండ్

Satyam News

Leave a Comment