26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

బొత్సాకు హెరిటేజ్ లీగల్ నోటీసు

#BotsaSatyanarayana

గత కొద్ది రోజులుగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు పంపింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి సరఫరా టెండర్ పొందిన ఇండాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు లింక్ పెడుతూ బొత్స సత్యనారాయణ కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

తమపై బొత్స సత్యానారాయణ అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని హెరిటేజ్ సంస్థ ఇంతకు ముందే తెలిపింది. అయినా సరే బొత్స సత్యనారాయణ ఆపకుండా హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దాంతో హెరిటేజ్ సంస్థ ఆయనకు లీగల్ నోటీసు ఇచ్చింది. ఆయన తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తదుపరి న్యాయపరమైన చర్యలకు పూనుకుంటామని హెరిటేజ్ హెచ్చరించింది.

లీగల్ నోటీసు పూర్తి పాఠం:

బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్రప్రదేశ్

విషయం: 18.02.2026 తేదీన ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన అసత్య, పరువునష్టం కలిగించే ప్రకటనలపై వెంటనే వివరణ, ఉపసంహరణ కోరుతూ లీగల్ నోటీసు

అయ్యా,

నా క్లయింట్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జె. సాంబమూర్తి సూచనల మేరకు ఈ లీగల్ నోటీసు జారీ చేయబడుచున్నది.

నా క్లయింట్ 1956 కంపెనీస్ యాక్ట్ ప్రకారం స్థాపించబడిన పబ్లిక్ లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ. 1992 నుండి పాలు మరియు పాల ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, విక్రయాల్లో నిమగ్నమై దేశంలోని 16 రాష్ట్రాల్లో విశేష ఖ్యాతి పొందింది. స్థాపించిన నాటి నుంచి నాణ్యత, ఆహార భద్రత, వినియోగదారుల ఆరోగ్యం విషయంలో కఠిన ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారులు, రైతులు, నియంత్రణ సంస్థలు, పరిశ్రమ వర్గాల మధ్య మంచి పేరు సంపాదించింది.

ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (FSMS) ను స్వచ్ఛందంగా అమలు చేస్తూ చట్టపరమైన ప్రమాణాలకంటే ఉన్నత ప్రమాణాలను పాటిస్తోంది. “హెరిటేజ్” బ్రాండ్‌ను విశ్వసనీయ, ప్రీమియం డెయిరీ బ్రాండ్‌గా నిలబెట్టింది. కార్పొరేట్ గవర్నెన్స్, పారదర్శకత, చట్టబద్ధత, సామాజిక బాధ్యతల పరంగా గుర్తింపు పొందింది. ISO 9001, ISO 22000 సర్టిఫికేషన్లు పొందడమే కాక, లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి గోల్డెన్ పీకాక్ అవార్డు 8 ఏళ్లలో 3 సార్లు అందుకుంది.

మీరు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా, ఇతర వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో కలిసి 18.02.2026న నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నా క్లయింట్‌పై అసత్య ఆరోపణలు చేశారు. అవి “సాక్షి” తెలుగు దినపత్రికలో ప్రచురించబడ్డాయి. మీరు “శ్రీవారి సొమ్ము దోపిడీకి ఇందాపూర్ ముసుగు” అనే శీర్షికతో చేసిన వ్యాఖ్యల్లో, 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ కాలంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)  ఆవు నెయ్యి సరఫరా ఒప్పందాలు ఇండాపూర్ డెయిరీ ద్వారా పరోక్షంగా హెరిటేజ్‌కు లభించాయని ఆరోపించారు.

అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సరఫరా విషయంలో హెరిటేజ్ ఫుడ్స్ మరియు ఇండాపూర్ డెయిరీ మధ్య యాజమాన్య సంబంధం ఏదీ లేదు. ఈ రెండు సంస్థల మధ్య ఉన్న సంబంధం పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికపై మాత్రమే ఉంటుంది. “22 కంపెనీలతో సిండికేట్ ఏర్పాటు” అనే మీ వ్యాఖ్య పూర్తిగా దురుద్దేశపూరితమైనది. “సిండికేట్” అనే పదానికి చట్టవిరుద్ధ అర్థం ఉందని తెలిసి కూడా ప్రజలను తప్పుదారి పట్టించేలా వాడారు.

హెరిటేజ్ ఫుడ్స్ చట్టపరంగా, నియంత్రణా వ్యవస్థల ప్రకారం వ్యాపారం నిర్వహిస్తోంది. వాణిజ్య సంబంధాలు ఉంటే అవి చట్టబద్ధమైనవే. మీరు చేసిన ఆరోపణలు అసత్యం, దారితప్పించే విధంగా, పరువునష్టం కలిగించేలా ఉన్నాయి. మార్కెట్‌లో, షేర్‌హోల్డర్లలో, వినియోగదారులలో నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఈ ప్రకటనలు దురుద్దేశంతో చేశారని మా క్లయింట్ భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం కలిగిన పత్రికలు, డిజిటల్, ఈ-పేపర్ ఎడిషన్ల ద్వారా ఈ ఆరోపణలు వ్యాప్తి చెందాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పరువు నష్టం కలిగించే ప్రయత్నం జరిగినట్లు మా క్లయింట్ అభిప్రాయపడుతోంది.

ఈ చర్యలు భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం సెక్షన్ 356 కింద నేరంగా పరిగణించబడతాయి. కాబట్టి, ఈ నోటీసు అందిన వెంటనే మీరు చేసిన అసత్య, దురుద్దేశపూరిత ఆరోపణలను ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ ప్రకటించవలసిందిగా కోరడమైనది. లేని పక్షంలో, మా క్లయింట్ మీపై సివిల్ మరియు క్రిమినల్ కేసులు దాఖలు చేయడానికి వెనుకాడదు.

అదేవిధంగా, ఈ లీగల్ నోటీసు ఖర్చుల కింద రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) చెల్లించవలసిందిగా డిమాండ్ చేయడమైనది.

అడ్వకేట్

Related posts

సంచలనం సృష్టిస్తున్న పాక్ సినిమా ది నెక్స్ట్ సలాహుద్దీన్

Satyam News

మూసీ పునరుజ్జీవం పేరుతో రేవంత్ మోసం

Satyam News

చకచకా 22ఎ నిషేధిత జాబితా భూములకు విముక్తి

Satyam News

సంక్షోభాలను జయించి..ఫీనిక్స్‌లా ఎగిసి.. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం….!!

Satyam News

48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

Satyam News

కరీంనగర్ సీపీ పై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Satyam News

Leave a Comment