మాజీ సీఎం జగన్ రెడ్డి దగ్గర పీఆర్ వోగా పని చేసిన ప్రస్తుత వైసీపీ నాయకుడు పూడి శ్రీహరి రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కుప్పం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులను పెట్టినట్లు పూడి శ్రీహరిపై ఆరోపణలు ఉన్నాయి.
చంద్రబాబునాయుడి చేతిలో కత్తిపెట్టి, ఆయన చొక్కాపై రక్తం మరకలు వేసి ఆయన రాజకీయ జీవితం అంతా హత్యలు చేసినట్లుగా వర్ణిస్తూ ఒక సోషల్ మీడియా పోస్టును కొందరు క్రియేట్ చేశారు. దీనికి సంబంధించి రాప్తాడు నియోజకవర్గానికి చెందిన గిరీశ్ కుమార్ రెడ్డి తో బాటు పూడి శ్రీహరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.
పూడి శ్రీహరికి చెందిన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో బాటు ఆయన ఇంటి నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను కూడా తీసుకున్నారు. దీనిపై వైసీపీ తీవ్రమైన ప్రతిస్పందన తెలిపింది. పూడి శ్రీహరిని అరెస్టు చేయడం అంటే జర్నలిస్టులను అరెస్టు చేయడమేనని, పూడి శ్రీహరి లాంటి సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు.
తాము అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న జర్నలిస్టులందరిని అరెస్టు చేస్తామని వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపి మద్యం కుంభకోణంలో నిందితుడుగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి బహిరంగంగా హెచ్చరించారు. అనంతరం పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలను కుప్పం కోర్టులో ప్రవేశ పెట్టగా కుప్పం కోర్టు వారిద్దరి రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దాంతో వైసీపీ నాయకుల సంతోషానికి అవధులు లేకుండా అయింది. జర్నలిస్టులను అరెస్టు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి తగిన శాస్తి జరిగిందని, న్యాయం గెలిచిందని ఊరూరా సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుని అరాచకాలు చేస్తున్నదని ప్రచారం చేశారు. పూడి శ్రీహరితో సహా చాలా మంది వైసీపీ నాయకులు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టారు.
అయితే కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసులు ఈ వ్యవహారంపై అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ఉన్నత న్యాయస్థానం దాని విచారణకు స్వీకరించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత రిమాండ్ నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
