ప్రపంచంహోమ్

జపాన్ లో తీవ్ర భూకంపం: సునామీ హెచ్చరిక

#Earthquake

జపాన్ ఈశాన్య తీర ప్రాంతాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. జపాన్ ఉత్తర-తూర్పు తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీర ప్రాంతాలకు సమీపంగా నివసించే ప్రజలు వెంటనే దూరంగా వెళ్లాలని హెచ్చరించారు. సునామీ అలలు గరిష్ఠంగా 3 మీటర్ల ఎత్తు వరకు రావచ్చని అంచనా వేయడంతో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.

జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, భూకంపం కేంద్రము సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ముఖ్యంగా ఇవాటే ప్రీఫెక్చర్, అమోరీ ప్రీఫెక్చర్, హక్కైడో ప్రాంతాల్లో భారీ అలలు తాకే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలను తక్షణమే భద్ర ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

అప్రమత్తంగా ఉన్న టాస్క్ ఫోర్స్

జపాన్ ప్రధాని సాన్యా తకైచ్చీ మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితిని ఎదుర్కొనేందుకు అత్యవసర టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.

జాతీయ ప్రసార సంస్థ NHK ప్రసారాల్లో, హచినో ఓడరేవు వద్ద నౌకలు సముద్రంలోకి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి. టెలివిజన్ స్క్రీన్లపై సునామీ అనే హెచ్చరికలు వరుసగా వెలువరించారు. భూకంప ప్రభావంతో హోన్షు ఉత్తర భాగంలోని అమోరీ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

జపాన్ సైస్మిక్ తీవ్రత స్కేల్ ప్రకారం ఈ భూకంపం “అపర్ 5” స్థాయికి చేరుకుంది. ఈ స్థాయి భూకంపంలో ప్రజలు నిలబడటం కూడా కష్టమవుతుంది. బలహీనంగా నిర్మించిన గోడలు కూలిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన “Ring of Fire” ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాల్లో సుమారు 20 శాతం జపాన్‌లోనే నమోదవుతాయి.

ఇదిలా ఉండగా, హొక్కైడో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, తొహోకూ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలపై ప్రభావాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఒనాగ్వా అణు విద్యుత్ కేంద్రం వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న అణు విద్యుత్ కేంద్రాలు లేకపోయినా, మూసివేసిన కేంద్రాల భద్రతపై అప్రమత్తత కొనసాగుతోంది.

Related posts

విషం ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

Satyam News

పాండురంగడి సేవలో తరించిన భక్త జనాబాయి

Satyam News

టెహ్రాన్ చమురు నిల్వలపై ఇజ్రాయిల్ దాడి

Satyam News

కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటున్న బంగ్లాదేశీయులు

Satyam News

ఇక టార్గెట్ టెహరాన్: యుద్ధం తీవ్రతరం

Satyam News

రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ…

Satyam News

Leave a Comment