కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక కేటాయింపులు లేవు. గత రెండు బడ్జెట్‌లలో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి 12 వేల 500 కోట్లు, అమరావతికి 50 వేల కోట్లు ఇచ్చారు. ఈసారి అలాంటి బంపర్ ఆఫర్‌లు లేవనే అనుకొన్నారు. కానీ బడ్జెట్ పద్దుల్లో రాష్ట్రానికి అదనంగా నిధులు రాకపోయినా.. 16వ ఆర్ధిక సంఘం ఏపీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
గతంలో అనుసరించిన వెయిటేజీ విధానం మార్చడం ద్వారా ఏపీకి కేంద్ర పన్నుల్లో వాటా భారీగా పెరిగింది. వెయిటేజీ పెరగడంతో వచ్చే ఐదేళ్లలో 35 వేల కోట్లు అదనంగా రానున్నాయి. ఇవి కాకుండా స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ఏకంగా 28 వేల 785 కోట్ల నిధులు అందబోతున్నాయి. ఈ సొమ్ముతో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కష్టాలు తీరే అవకాశం ఉంది.
రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్లకు.. ఆర్ధిక సంఘం సిఫారసులే కీలకం. ఈ ఏడాది నుంచి కొత్తగా అమల్లోకి వచ్చిన 16వ ఆర్ధిక సంఘం సిఫారసులు.. లోకల్ బాడీస్‌కి మరిన్ని నిధులు కేటాయించాలని రికమండ్ చేసింది. ఆర్ధిక సంఘం సిఫారసు ప్రకారం గ్రామీణ స్థానిక సంస్థలయిన పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు 16 వేల 627 కోట్లు కేటాయించారు. పట్టణ స్థానిక సంస్థలయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు 12 వేల 158 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు విడుదలైతే.. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల స్వరూపం మారిపోతుంది.
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో 60 శాతం ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు మ్యాచింగ్ గ్రాంట్‌గా విడుదల చేయాల్సి వచ్చేది. 16వ ఆర్ధిక సంఘం సిఫారసుల్లో కేంద్రం వాటాను 80 శాతానికి పెంచారు. అంటే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు విడుదల చేస్తే చాలు. వచ్చే ఐదేళ్లలో ఈ పద్దు కింద దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి 7 లక్షల 91 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తారు.
విపత్తు నిర్వహణ కోసం రాష్ట్రాలకు 2 లక్షల కోట్లు కేటాయించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం ఏపీకి 8 వేల 166 కోట్లు మంజూరు చేయాలని ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది. పన్నుల వాటాల్లో వెయిటేజీ మార్పు, స్థానిక సంస్థల నిధులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్స్ ద్వారా 16వ ఆర్ధిక సంఘం అమల్లో ఉండే కాలంలో రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయలు అదనంగా అందుతాయి.
