ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్ధి (ప్రాసెస్) చేయడంలో ఆంధ్రప్రదేశ్ ‘గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్’ గా ఆవిర్భవిస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ అన్నారు.
న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక సాంగ్రిల్లా హోటల్‌లో ఫిక్కి (FICCI), డెలాయిట్ సంయుక్తంగా నిర్వహించిన 17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సు ముఖ్య ఇతివృత్తం ఆయన “స్టెప్ అప్ – సామర్థ్యం మరియు లాభదాయకత కోసం విస్తృత రూపాంతీకరణ” (Scalable Transformation for Efficiency and Profitability) ను ఆయన అభినందించారు.
ఆహార రంగమే ఈ దశాబ్దపు అతిపెద్ద అవకాశం:
సదస్సులో మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ, “ప్రస్తుత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల గురించి మాట్లాడుకుంటున్నారనీ కానీ ఈ దశాబ్దంలో అత్యంత భారీ ఆర్థిక వ్యాపార అవకాశం మన డైనింగ్ టేబుల్‌పై ఉన్న ‘ఆహారం’ రూపంలోనే ఉందని అన్నారు.
నేడు ఆహారం అంటే కేవలం వ్యవసాయం మాత్రమే కాదని అది ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ భౌగోళిక వ్యూహాత్మక అంశాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార ప్రాసెసింగ్ రంగం 8.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ కలిగి ఉండగా, అందులో భారత దేశ వాటా 543 బిలియన్ డాలర్లని, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అందులో 49 బిలియన్ డాలర్లు (దాదాపు 9 శాతం) వాటాను అందిస్తూ దేశంలోనే అత్యధిక రిజిస్టర్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కలిగిన రాష్ట్రంగా నంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు .
ఆంధ్రప్రదేశ్ – జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాలు:
రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ కింది రంగాలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ప్రకటించారు. మిర్చి, నిమ్మ, కోకో, ఆయిల్ పామ్, బొప్పాయి మరియు గుడ్ల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం. బియ్యం, మామిడి, అరటి, మసాలా దినుసుల ఉత్పత్తిలోనూ భారీ వాటా కలిగి ఉందని ఇది పెట్టుబడిదారులకు కావలసిన ముడిసరుకును భారీ స్థాయిలో అందించగలదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టిని ప్రస్తావిస్తూ, రైతుల సమీపంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ జరిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, యువతకు ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన “భారతదేశం ప్రపంచానికి ఆహారం అందించాలని భావిస్తే… దానిని ప్రాసెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఇకపై రాష్ట్రం కేవలం పంటలు పండించడానికే పరిమితం కాదని, ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచ బ్రాండ్‌గా మారుతుందని పేర్కొన్నారు.
‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ కాదు… ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’:
రాష్ట్రంలో కేవలం సులభతర వాణిజ్యం మాత్రమే కాకుండా, ఒక అడుగు ముందుకు వేసి వేగవంతమైన వాణిజ్యం వైపు అడుగులు వేస్తున్నామని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులు అనుమతుల చుట్టూ తిరగడం కాకుండా, వేగంగా ఉత్పత్తిని ప్రారంభించినప్పుడే లాభాలు వస్తాయని, అందుకోసమే సింగిల్ డెస్క్ అనుమతులు, ప్రత్యేక ప్రాజెక్ట్ హ్యాండ్-హోల్డింగ్ వేగవంతమైన నిర్ణయాలు మా ప్రభుత్వ పనితీరు విధానమని స్పష్టం చేశారు.
రూ. 30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం:
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సాధించిన ప్రగతి మౌలిక వసతులను మంత్రి వివరిస్తూ.. మౌలిక సదుపాయాలు: రాష్ట్రంలో 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, 6 కార్యాచరణ రేవులు (Ports), 7 విమానాశ్రయాలు, 24×7 నాణ్యమైన విద్యుత్ మరియు 9 ప్లగ్-అండ్-ప్లే ఫుడ్ పార్కులు అందుబాటులో ఉన్నాయన్నారు.
భారీ నిల్వ సామర్థ్యం: 17.20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆధునిక కోల్డ్ స్టోరేజ్, 33.52 లక్షల మెట్రిక్ టన్నుల వేర్‌హౌసింగ్ వసతులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
భారీ పెట్టుబడులు: గత రెండేళ్లలో రూ. 11,800 కోట్ల విలువైన 29 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాం అన్నారు. ఇందులో రిలయన్స్ కన్స్యూమర్, గోద్రెజ్ ఆగ్రోవెట్, మదర్ డెయిరీ, 3F ఆయిల్ పామ్, ఐటిసి, స్నేహా ఫార్మ్స్, ఐబి గ్రూప్, హంగ్యో ఐస్‌క్రీమ్స్ వంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయన్నారు. పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో మరో 30 కంపెనీలతో రూ. 8,000 కోట్ల ఒప్పందాలు (MoUs) జరిగాయని తెలిపారు.
లక్ష్యాలు: నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా రూ. 30,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా 3 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.భవిష్యత్తులో ఆహార ప్రాసెసింగ్ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రిసిషన్ అగ్రికల్చర్, డిజిటల్ సప్లై చైన్, స్మార్ట్ లాజిస్టిక్స్ ఆధారంగా నడుస్తుందని, టెక్నాలజీ రంగంలో పెట్టుబడిదారులకు పూర్తి మద్దతు ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిస్తూ… ఆంధ్రప్రదేశ్‌ను కేవలం ఒక గమ్యస్థానంగా చూడకుండా, మీ దీర్ఘకాలిక వృద్ధి భాగస్వామిగా (Growth Partner) చూడాలని, “మీ విజయమే మా విజయం” అంటూ ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
