ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శైవక్షేత్రంగా, ‘దక్షిణ కాశీ’గా ప్రసిద్ధి చెందిన ముసునూరు మండలం బలివే గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి (బలే రామస్వామి) ఆలయ పునఃప్రతిష్ఠ శంకుస్థాపన మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని కి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం, వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ రూ. 2.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, హోమ క్రతువులో పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన సంస్కృతి, ఆలయాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయ నిర్మాణాన్ని మంత్రి కొలుసు. పార్థసారథి గారి ఆధ్వర్యంలో, త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అన్ని మౌలిక వసతులు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ పాలకవర్గ కమిటీ సభ్యులు, అర్చకులు, కూటమి నాయకులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
