ముఖ్యంశాలుహోమ్

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

#ChandrababuNaidu

సచివాలయంలో వైద్యారోగ్య రంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని అత్యున్నత వైద్య నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.

ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతికతను వైద్యారోగ్య రంగంలో విస్తృతంగా వినియోగించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైద్యారోగ్య రంగంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పౌరుల ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా భద్రపరచే ఉద్దేశంతో ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందిస్తున్నామని చెప్పారు.

గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని

గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటు చేసి పౌరుల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేసినట్లు వెల్లడించారు. రియల్ టైమ్‌లో పౌరుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో వివిధ విభాగాల్లో అవసరమైన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందని వివరించారు.

2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్సకే పరిమితం కాకుండా ముందస్తు నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్య సమస్యల నియంత్రణలో యోగా, నేచురోపతి వంటి ప్రకృతి ఆధారిత చికిత్సలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రివెంటివ్ వెల్‌నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్, హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఏపీలో మెడ్‌టెక్ పార్కు ద్వారా ఆధునిక వైద్య పరికరాల తయారీ జరుగుతోందని, దీని ద్వారా రాష్ట్రం వైద్య సాంకేతిక రంగంలో ముందంజలో నిలుస్తుందన్నారు.

ఆరోగ్య రంగంలో ముందస్తు జాగ్రత్తలు

వ్యాధులు రాకముందే నియంత్రించే ప్రివెంటివ్ టెక్నాలజీలపై దృష్టి పెట్టడం వల్ల వైద్యారోగ్య వ్యయాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నమైన ప్రాజెక్టులను అమలు చేసేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల సలహాలు అవసరమని సీఎం కోరారు. ప్రతి రంగంలోనూ సాంకేతికత ద్వారా అత్యుత్తమ ప్రమాణాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని, సామర్థ్యాల పెంపుతో పాటు ప్రజలకు అత్యున్నత స్థాయి సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

క్వాంటం టెక్నాలజీ, ఏఐ ఆధారిత రియల్ టైమ్ డేటా విశ్లేషణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఏఐ ద్వారా నాలెడ్జి వ్యవస్థీకృతమైందని, గ్లోబల్ కమ్యూనిటీకి సేవలందించే స్థాయికి సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

విదేశీ నిపుణులతో సమీక్ష

ఈ సమీక్ష సమావేశంలో గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా పలు ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిగింది. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానాలపై నిపుణులతో అభిప్రాయాలు పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని వైద్యారోగ్య రంగ నిపుణులతో సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి యూఎన్‌ఎయిడ్స్ ప్రతినిధి పీటర్ పాయిట్, డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటా, శ్రీకాంత్ నాదముని, గగన్ దీప్ కాంగ్, మార్గరెట్ ఎలిజిబెత్, నిఖిల్ టాండన్ తదితర ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు హాజరయ్యారు.

Related posts

కనుల పండువగా శ్రీ అమర లింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Satyam News

కేంద్ర మంత్రి పెమ్మసానికి ఢిల్లీలో కీలక బాధ్యతలు

Satyam News

ప్రియురాలి మోజులోనే ఎల్ మెన్చో హతం

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి

Satyam News

సాక్షికి పోటీగా రూ. 500 కోట్లతో విజయసాయి రెడ్డి మీడియా!

Satyam News

హైదరాబాద్‌ సిటీ లో మొత్తం ఎన్ని గణేష్ విగ్రహాలు ఉన్నాయో తెలుసా?

Satyam News

Leave a Comment