సంపాదకీయంహోమ్

ఒక హత్య… ఆరు మరణాలు… తేలని క్లైమాక్స్

#YSVivekanandaReddy

ఒక హత్య…. అదీ కూడా ఎవరో తెలియని వ్యక్తిది కాదు. పులివెందులలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న వ్యక్తి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య. ఆయన ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, మరో ముఖ్యమంత్రికి బాబాయి. స్వయంగా కూడా ఆయన ఎన్నో పదవుల్లో పని చేసిన వ్యక్తి. ప్రజలకు ఎంతో సన్నిహితంగా ఉండే ప్రజానాయకుడు. అలాంటి వై ఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపేస్తే ఇప్పటి వరకూ … మర్డర్ జరిగి ఏడేళ్లు గడిచినా అతాపతా లేదు.

రాయలసీమ గడ్డలో పులివెందులలో రాజకీయం అంటే ప్రసంగాలు కాదు, లెక్కలు, గుసగుసలు, ఎప్పుడు ఎటు తిరుగుతాయో తెలియని సమీకరణాలు. ఆ నేలపై జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. కథ ముగిసిందనుకున్న చోటే కొత్త అధ్యాయం మొదలైంది.

హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం. సీబీఐ దర్యాప్తును ఆధారంగా చేసుకుని, పీఎంఎల్‌ఏ చట్టం కింద మనీలాండరింగ్ కోణంలో ఈడీ రికార్డులను పరిశీలిస్తోంది. ఈ కేసులో ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. హత్యకు ముందు, వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు, సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి పాత్రలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ఏదీ ఎదుట ఎల్లుండి ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ అంశం కూడా తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.

‘గుండ్లవాగు శంకర్’: ఒక పజిల్

దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (గుండ్లవాగు శంకర్) వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. పులివెందుల, కడప రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడే శక్తులకు సింహస్వప్నం. తానే స్వయంగా అనామక పార్టీల బీ-ఫారమ్‌లపై లేదా ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతాడు. వైఎస్ ప్రత్యర్థులను  ప్రత్యక్షంగా పోలింగ్ రోజు బూతుల్లో బెదిరిస్తాడు. వైఎస్ కుటుంబం కోసం ఎన్నికల బూతుల్లో చక్రం తిప్పడం ఇతని శైలి. దశాబ్దాల పులివెందుల, కడప ఎంపీ సీట్లలో మెజారిటీలకు కారణం మన మిస్టరీ శంకర్. ఆయన స్వయంగా నామినేషన్ వేసి బరిలో నిలబడడం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయం. గత ఎన్నికల్లో కూడా అందుకోసం కోర్టును అనుమతి అడిగాడు.

ఇక్కడే కథలో ట్విస్ట్. ఆయన కుమారుడి వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలో ఆపి మరీ వచ్చారు. పులివెందుల వీధుల్లో బుల్లెట్ బైక్ వెనుక శంకర్‌ను కూర్చోబెట్టుకుని తిప్పే సాన్నిహిత్యం వైఎస్ అవినాశ్ రెడ్డి.

వివేకా తరువాత అరడజను (అ)సహజ మరణాలు!

ఈ కేసును మరింత భయానకంగా మార్చింది ఒక అంశం: కేసుతో ముడిపడిన ఆరుగురు వ్యక్తుల మరణాలు.

  1. నారాయణ యాదవ్– 2019 డిసెంబర్‌లో కన్నుమూశారు. అంత్యక్రియల దారిలో ఫోన్ సంభాషణలు విన్నారని చెబుతారు.
  2. బి. రంగన్న – హత్యను చూసిన ఏకైక సాక్షిగా చెప్పే వాచ్‌మన్. మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజులకే ఆసుపత్రిలో మరణించారు.
  3. కల్లూరి గంగాధర్ రెడ్డి – “హత్యను నాపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తామన్నారు” అని సీబీఐకి చెప్పినట్లు కథనం. 2022 జూన్‌లో మృతి చెందారు.
  4. కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి – 2019 సెప్టెంబరులో మరణించారు. ఆయన పేరుతో ఉన్న లేఖలపై వివాదం ఉంది.
  5. డా. వైఎస్ అభిషేక్ రెడ్డి – వాంగ్మూలం ఇచ్చిన యువ వైద్యుడు. జనవరిలో అనారోగ్యంతో హఠాన్మరణం.
  6. ఈసీ గంగిరెడ్డి– 2020 అక్టోబరులో మరణించారు. వివేకా ఇంటి నుండి తలకొట్టుకుంటూ ఏడుస్తూ బయటకు వచ్చిన సున్నిత మనసున్న డాక్టర్.

మరణించిన ప్రతి ఒక్కరూ కేసుతో సంబంధం ఉన్న వారే అనే విషయం మనకు తెలిసిందే. కానీ వీటి వెనుక కుట్రలు ఏవైనా ఉన్నాయా అని విచారిస్తే అది మరో ఆరు వెబ్ సిరీస్లు అవుతాయి.

క్లైమాక్స్ ఎక్కడ?

డాక్టర్ సునీత రాష్ట్రపతికి వ్రాసిన లేఖ తరువాత  ఈడీ దర్యాప్తు వేడెక్కుతోంది. మరోవైపు సాక్షుల మౌనం, మరణాల నీడ. బతికున్న సునీల్ యాదవ్ నుండి దస్తగిరి వరకు మా ప్రాణాలకు రక్షణ కావాలి అని దీనంగా వేడుకుంటున్నారు. సూత్రధారులు ఎవరో, ఎవరి చేతులు ఏ తెర వెనుక ఉన్నాయో న్యాయస్థానమే తేల్చాలి. సాక్షిలో గుండెపోటు స్క్రోలింగుకు ముందే తెల్లవారుఝామున లోటస్ పాండ్ కు ఆ గొడ్డలి పోట్ల గురించి తెలిసీ ఎందుకు డ్రామా ఆడారు?

అదే లోటస్ పాండ్‌కు హత్య జరిగిన ముందురోజు ఉదయం వైఎస్ వివేకానందరెడ్డి రావడం, లోపల గొడవ జరగడం, ఆయన ఏడ్చుకుంటూ రావడం జరిగింది. ఎప్పుడూ కూతురికి చెప్పి మాత్రలు తీసుకొని వెళ్లే ఆయన, లోటస్ పాండ్ ముందర టికెట్ల కోసం ధర్నా చేస్తున్న వారిని కూడా పలకరించి, అటు నుండి అటే మృత్యువు తరుముకు వస్తున్నట్లుగా.. ఎన్నికల ప్రచారం కోసం కడపకు వెళ్లిపోవడం తదితర రహస్యాల మీద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నోరు తెరిస్తే చిటికెలో తేలిపోయే మర్డర్ కేసు ఇది. అటు నుండి కాకుండా ఆరు సహజ మరణాలు జరిగినా అంతులేని కథ లెక్కన సాగుతోంది.

ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలు ఆ చివరి సీన్ కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాయి.

Related posts

ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ: దారుణ హత్య

Satyam News

నమ్మిన భక్తుల కల్పతరువు శ్రీ తిమ్మప్ప స్వామి

Satyam News

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె

Satyam News

వ్యవసాయంలో ఏపీ టాప్‌….. ప్రకృతి సేద్యానికి కేంద్రం నజరానా

Satyam News

విద్యార్థుల భవిష్యత్‌ తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

Satyam News

శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం

Satyam News

Leave a Comment