అక్రమ చొరబాటుదారులే పశ్చిమ బెంగాల్ కు ప్రధాన సమస్య అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ చొరబాట్ల కారణంగా పశ్చిమ బెంగాల్ జనాభా స్వరూప స్వభావాలే మారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దీనివల్లే తరచు అల్లర్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అదే సమయంలో మతువా వంటి శరణార్థ వర్గాలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఉత్తర బెంగాల్‌లోని ముస్లిం ఆధిక్య జిల్లా ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ, అక్రమ చొరబాట్లు రాష్ట్రానికి “చాలా పెద్ద సవాల్”గా మారాయని అన్నారు.
అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నది సిండికేట్
టీఎంసీ “ఆశ్రయంతో పాటు సిండికేట్ రాజ్” వల్లే అక్రమ వలసలు పెరిగాయని, చొరబాటుదారులతో పాలక పార్టీకి పొత్తు ఉందని ఆరోపించారు. “ప్రపంచంలో డబ్బుకు లోటు లేని అభివృద్ధి చెందిన దేశాలు కూడా చొరబాటుదారులను తొలగిస్తున్నాయి. అదే విధంగా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా చొరబాటుదారులను తొలగించడం అవసరం,” అని మోదీ అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ వలసలను అడ్డుకునేందుకు, చొరబాటుదారులను ఏరివేసేంకు “కఠిన చర్యలు” తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్రమ చొరబాట్ల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. “కొన్ని ప్రాంతాల్లో మాట్లాడే భాష కూడా మారుతోంది అని ప్రజలు నాకు చెబుతున్నారు. భాష, మాండలికాల్లో తేడాలు వస్తున్నాయి.
చొరబాటుదారుల వల్ల పెరుగుతున్న అల్లర్లు
చొరబాటుదారుల జనాభా పెరగడంతో మాల్దా, ముర్షిదాబాద్ సహా పశ్చిమ బెంగాల్‌లో అనేక చోట్ల అల్లర్లు చెలరేగుతున్నాయి,” అని మోదీ వ్యాఖ్యానించారు. చొరబాటుదారులను రాష్ట్రంలో స్థిరపడేలా చేయడానికి టీఎంసీ “సిండికేట్ వ్యవస్థ” పనిచేస్తోందని, చొరబాటుదారులు పాలక పార్టీ మధ్య “పొత్తు” ఉందని మోదీ ఆరోపించారు.
“ఈ పొత్తును మీరు చెరిపేయాలి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అక్రమ చొరబాట్లపై, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను,” అని ఆయన అన్నారు. మోదీ ప్రత్యేకంగా శరణార్థ వర్గాలకు, ముఖ్యంగా పౌరసత్వ చర్చలో కీలకంగా ఉన్న రాజకీయ ప్రాధాన్యత గల మతువా సముదాయానికి భరోసా ఇచ్చారు.
“మతపరమైన వేధింపుల కారణంగా భారత్‌లో ఆశ్రయం పొందిన మతువాలు వంటి శరణార్థులకు నేను భరోసా ఇస్తున్నాను. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని ఆయన చెప్పారు. అక్రమ చొరబాట్లపై కఠిన వైఖరి మరియు వేధింపులకు గురైన శరణార్థులకు రక్షణ అనే ద్వంద్వ సందేశాన్ని మోదీ ఇచ్చారు.
ఇది ఓటర్ల జాబితాల ప్రత్యేక సాంద్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై రాజకీయ చర్చ నడుస్తున్న వేళ, 294 సభ్యుల అసెంబ్లీకి సుమారు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ పర్యటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీని జాతీయ భద్రతకు కాపలాదారిగా, శరణార్థుల హక్కులకు హామీదారుగా మోడీ స్పష్టంగా చెప్పారు.
తృణమూల్ కాంగ్రెస్ గుండాగిరిని అడ్డుకోవాల్సిందే…
టీఎంసీపై దాడిని మరింత ఉధృతం చేస్తూ, ఆ పార్టీ “గూండాగిరి” మరియు “పేదలను బెదిరించే రాజకీయాలు” త్వరలోనే ముగుస్తాయని మోడీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు చుట్టుముట్టిన బెంగాల్ ఇప్పుడు మార్పుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. “బెంగాల్ చుట్టూ అన్ని వైపులా మంచి పాలనకు ప్రతీకగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్‌లో కూడా మంచి పాలనకు సమయం వచ్చింది,” అని అన్నారు.
బిహార్‌లో బీజేపీ గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, అప్పుడే “ఇప్పుడు బెంగాల్ సమయం” అని తాను చెప్పానని మోడీ గుర్తు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం బీజేపీకి భారీ మెజారిటీ ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పేదల కోసం ఉన్న సంక్షేమ పథకాలను టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని, కేంద్ర పథకాల లబ్ధి ప్రజలకు చేరనివ్వడం లేదని ప్రధాని ఆరోపించారు.
మంచి పథకాలు మీకు కావాలా వద్దా?
“ఉచిత విద్యుత్ వంటి పథకాల లబ్ధి బెంగాల్‌కు అందాలా లేదా?” అని ఆయన ప్రశ్నించారు. “ప్రజలకు నిజమైన సంక్షేమం జరగాలంటే అడ్డంకులు సృష్టించే టీఎంసీ ప్రభుత్వం కాకుండా, ప్రజల పక్షాన నిలిచే బీజేపీ ప్రభుత్వం రావాలి,” అన్నారు. భారీ అవినీతి ఆరోపణలు చేస్తూ, “నిర్దయమైన, కఠినమైన” టీఎంసీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటోందని, పేదల కోసం కేంద్రం పంపిన నిధులను మళ్లిస్తోందని మోడీ అన్నారు.
“బెంగాల్‌లో ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు ఉండాలి. అర్హులందరికీ ఉచిత రేషన్ అందాలి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పేదల సంక్షేమ పథకాల పూర్తి లబ్ధి మీకు చేరాలి,” అని చెప్పారు. “కానీ ఇది జరగడం లేదు, ఎందుకంటే కేంద్రం పంపిన డబ్బును టీఎంసీ నేతలు దోచుకుంటున్నారు,” అని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అమలు కావడం లేదని కూడా ప్రధాని ప్రస్తావించారు. “ఈ రోజు ఆయుష్మాన్ భారత్ అమలు కాని ఏకైక రాష్ట్రం బెంగాల్. నా బెంగాల్ సోదర సోదరీమణులు దీని లబ్ధిని పొందకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఇలాంటి నిర్దయ ప్రభుత్వానికి వీడ్కోలు పలకడం అవసరం,” అని అన్నారు.
అభివృద్ధి అంశాన్ని ముందుకు తెస్తూ, బీజేపీ ప్రభుత్వం మాల్దా మరియు పశ్చిమ బెంగాల్‌కు “పాత గౌరవం, వైభవం”ను తిరిగి తీసుకువస్తుందని, రైతులు మరియు యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తుందని మోడీ చెప్పారు. “మాల్దా మామిడి ఆర్థిక వ్యవస్థను మేము కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం,” అని ఆయన అన్నారు.
అంతకుముందు రోజే, హౌరా–గువాహటి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును మోడీ ప్రారంభించారు. అలాగే బెంగాల్‌లో సుమారు రూ. 3,250 కోట్ల విలువైన రైలు, రోడ్డు మౌలిక సదుపాయ ప్రాజెక్టులను ప్రారంభించారు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ రైలు హౌరా గువాహటి ప్రయాణ సమయాన్ని సుమారు 2.5 గంటలు తగ్గించనుంది. అదేవిధంగా న్యూజల్పాయిగుడి నాగర్‌కోయిల్, న్యూజల్పాయిగుడి తిరుచిరాపల్లి, అలీపుర్ద్వార్ ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు, అలీపుర్ద్వార్ ముంబై (పన్వేల్) మధ్య నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు.
మహారాష్ట్ర, కేరళల్లో ఇటీవల బీజేపీ సాధించిన ఎన్నికల విజయాలను ప్రస్తావించిన మోడీ, గతంలో బలహీనంగా భావించిన ప్రాంతాల్లో కూడా పార్టీకి అపూర్వమైన మద్దతు లభిస్తోందని అన్నారు. ఇది ముఖ్యంగా యువతలో బీజేపీ అభివృద్ధి నమూనాపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
