ప్రత్యేకంహోమ్

వెయ్యి కోట్లు తీసుకొని జగన్‌ కొంప ముంచిన  ఐ ప్యాక్‌ టీమ్‌?

#YSJagan

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. వైసీపీ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ తప్పు జరిగిందనే అంశంపై మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ చేసిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బటన్‌ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ వైసీపీ ఎందుకు ఓడిపోయిందనే అంశంపై ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా వైసీపీ చీఫ్ జగన్ అనుసరించిన వ్యూహాలు, ఐ-ప్యాక్ టీమ్ పార్టీ కొంపముంచాయన్నారు ఆమంచి.

ఎన్నికల సమయంలో పార్టీలు వ్యూహాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తుంటాయి. వైసీపీ కూడా ఎన్నికల వ్యూహం, సర్వేల కోసం ఐ-ప్యాక్ టీమ్‌పై భారీగా ఖర్చు పెట్టింది. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలను పక్కనబెట్టి కేవలం సర్వేల మీద మాత్రమే ఆధారపడటం వల్ల పెద్ద పొరపాటు జరిగిందని ఆమంచి స్పష్టం చేశారు. ఎన్నికల సర్వేలు ఎప్పుడూ గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని చూపలేవని, ప్రజల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందనేది ఆ సర్వేలు అంచనా వేయలేకపోయాయన్నారు. ఎన్నికల వ్యూహకర్తలు పార్టీకి కనీసం ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై వాస్తవిక అంచనాలను ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారని, కేవలం పాజిటివ్ నివేదికలతో హైకమాండ్‌ను మభ్యపెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 30 నుంచి 40 సీట్లకు మించి గెలవడం కష్టమని తాను ముందే కొందరితో చెప్పినట్లు ఆమంచి గుర్తు చేసుకున్నారు.

ముఖ్యమంత్రికి, ప్రజాప్రతినిధులకు మధ్య ఉండాల్సిన సంబంధాలు లేకపోవడమే వైసీపీ ఘోర ఓటమికి ప్రధాన కారణమన్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను, వ్యతిరేకతను తెలుసుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారని చెప్పారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్‌ను సరిగ్గా అంచనా వేయగలరు. కానీ ఆ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునే వ్యవస్థ బలహీనపడటంతో కిందిస్థాయిలో ఏం జరుగుతుందో అధిష్టానానికి తెలియకుండా పోయిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్న ప్రజా సంబంధాలు, అధికారులతో సమన్వయం, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రాధాన్యత అప్పట్లో వేరుగా ఉండేదని, ప్రస్తుత పాలనలో ఆ పద్ధతి కొరవడిందని ఆమంచి విశ్లేషించారు.

ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయించలేవనే వాస్తవాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు ఆమంచి. ప్రజలు కేవలం తమకు నేరుగా వస్తున్న డబ్బులను మాత్రమే బేరీజు వేసుకోరు. నిత్య జీవితంలో పెరుగుతున్న ఖర్చులు, నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు, కరెంట్ బిల్లులు, ఇసుక కొరత వంటి అనేక అంశాలను బేరీజు వేసుకుంటారని స్పష్టం చేశారు. మధ్యతరగతి కుటుంబాలు తమ సంపాదనతో పాటు పెరుగుతున్న ఖర్చులను బట్టి ప్రభుత్వ పనితీరును అంచనా వేస్తాయని ఆమంచి విశ్లేషించారు. మొత్తానికి వేల కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకున్న ఐ-ప్యాక్ సర్వేలు, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం, క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించలేకపోవడం వంటి అంశాలే వైసీపీ కొంపముంచాయన్నారు ఆమంచి.

Related posts

తప్పుడు మాటలతో తికమక జగన్

Satyam News

ఏపిలో ఐఏఎస్ లకు పోస్టింగ్ లు

Satyam News

హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

లీక్ వీరులకు షాక్: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు

Satyam News

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

ప్రయివేటు హ్యాకర్లతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి

Satyam News

Leave a Comment