గుంటూరుహోమ్

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

#NirmalaSitaraman

పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ బ్యాంకింగ్ సేవలను ప్రజల ఇంటి గడపకు తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సేవల శాఖ, ఎస్‌ఎల్‌బీసీ, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రశంసించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేంద్ర ఆర్థిక సేవల శాఖ, ఎస్‌ఎల్‌బీసీ, బ్యాంకుల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం సామాన్యులకు ఎంతో కష్టమైన విషయమని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు వంటి ప్రతి అర్హులైన వర్గానికి బ్యాంకులు స్వయంగా వెళ్లి రుణాలు అందించడం దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన గొప్ప సంస్కరణగా ఆయన అభివర్ణించారు.

ఈ కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లాలో 1,04,000 మంది లబ్ధిదారులకు రూ.3,312 కోట్ల రుణాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురిని పరిగణిస్తే దాదాపు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే కార్యక్రమం ఇదేనని పేర్కొన్నారు.

మహిళలకు ప్రత్యేక ఆర్ధిక సాయం

రుణాల విభజన వివరాలను వెల్లడిస్తూ వ్యవసాయ రంగంలో 84,893 మందికి రూ.2,363 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగంలో 4,469 యూనిట్లకు రూ.335 కోట్లు, గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ తదితర అవసరాల కోసం 15,228 ఖాతాలకు రూ.624 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. వీటిలో వివిధ ప్రభుత్వ పథకాల కింద సుమారు రూ.2,500 కోట్ల రుణాలను ఈరోజే లబ్ధిదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 15 వేల మంది మహిళలకు, 13,355 మంది పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరయ్యాయని, పీఎం సూర్య ఘర్ పథకం కింద 8,574 కుటుంబాలకు రూ.98 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

ఒకప్పుడు అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేటు రుణదాతలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ప్రజలు ఆధారపడాల్సి వచ్చేదని, ఇప్పుడు బ్యాంకులు నేరుగా రుణాలు అందించడం వల్ల ఆ పరిస్థితికి పూర్తిగా అడ్డుకట్ట పడుతోందని సీఎం పేర్కొన్నారు. అధిక వడ్డీ, చక్రవడ్డీ భారాల నుంచి ప్రజలను విముక్తి చేసే దిశగా ఇలాంటి క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన బ్యాంకింగ్ సంస్కరణలను సీఎం ప్రత్యేకంగా కొనియాడారు. నిరర్థక ఆస్తుల (NPAలు) నియంత్రణ, బలహీన బ్యాంకుల విలీనం, సమర్థవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం, డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణ, యూపీఐ విప్లవం, జన్‌ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా లీకేజీల నివారణ, జీఎస్‌టీలో సరళీకరణ వంటి సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని పేర్కొన్నారు. తాను అనేక మంది ఆర్థిక మంత్రులను చూసినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకు రూపకర్తగా నిర్మలా సీతారామన్ అత్యంత సమర్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 2047 వికసిత్ భారత్ సాధనకు అవసరమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తున్న కీలక నాయకురాలు నిర్మలా సీతారామన్ అని సీఎం అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,157 కోట్లు విడుదల చేసిందని, 2027 మార్చి నాటికి తొలి దశను పూర్తి చేసి దేశానికి అంకితం చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు.

విశాఖ ఉక్కును పునరుద్ధరించాం

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగార పునరుద్ధరణకు కేంద్రం రూ.11,480 కోట్ల సహకారం అందించిందని అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించి రాష్ట్రానికి భారీ నిధులు సమీకరించామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.28 వేల కోట్లు, ఇతర కేంద్ర పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి తీసుకువచ్చామని చెప్పారు. రాయలసీమను దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో కార్యాచరణ చేపట్టామని, ఇందులో రూ.40 వేల కోట్లు కేంద్ర సహకారంతో రుణాల రూపంలో, మిగిలిన రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమీకరిస్తామని వెల్లడించారు.

రాష్ట్ర అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించడంలో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి సహకారం ఎంతో కీలకమైందని సీఎం చెప్పారు. గతంలో 12 నుంచి 13 శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లను 8–9 శాతానికి తగ్గించడం ద్వారా సంవత్సరానికి రూ.1,738 కోట్ల మేర ఆదా అవుతోందని వివరించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాతావరణ మార్పులు, తక్కువ వర్షపాతం వంటి సవాళ్లు నెలకొన్నాయని, కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ నీటి లభ్యత ఆందోళనకరంగా ఉందని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నారని, ప్రపంచ సవాళ్ల మధ్య కూడా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలవడం ఇందుకు నిదర్శనమన్నారు.

మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ దేశ మహిళలకు ఆదర్శమని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 10 లక్షల డ్వాక్రా సంఘాలు, కోటి 10 లక్షల మంది సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్” లక్ష్యంతో ప్రతి కుటుంబంలో కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. గత ఏడాది లక్ష మంది ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలు ఏర్పడగా ఈ ఏడాది ఐదు లక్షల మంది కొత్త పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Related posts

పాక్ లో భారీ వరదలు: 327 మంది మృతి

Satyam News

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Satyam News

కోల్డ్ వేవ్ తో అల్లాడుతున్న ఉత్తరాది రాష్ట్రాలు

Satyam News

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెకు  మరమ్మతులు

Satyam News

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

పవిత్ర తిరుమల కొండపై కర్ణాటక కుట్ర

Satyam News

Leave a Comment